
పంట కాలువలో ఇరుక్కుపోయిన టూరిస్టు బస్సు
కొమరోలు: ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ప్రైవేట్ టూరిస్టు బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన కొమరోలు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్ నుంచి తిరుమలకు వెళుతున్న టూరిస్టు బస్సు కొమరోలు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో పొలంలోకి దూసుకెళ్లి పంట కాలువలో ఇరుక్కుపోయింది.
సమాచారం అందుకున్న ఎస్సై ఎ.సుబ్బరాజు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపారు. పంట కాలువలో ఇరుక్కుపోయిన బస్సును జేసీబీతో బయటకు తీశారు.
క్షేమంగా ప్రయాణికులను తిరుమల దర్శనానికి పంపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం నుంచి బయట పడినట్లుగా ప్రయాణికులు తెలిపారు. వెంటనే స్పందించిన పోలీసు సిబ్బందికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment