సుందరయ్య మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు
త్రిపురాంతకం: భక్తి గీతాలు ఆలపిస్తూ కుటుంబాలను పోషించుకునే బృందాన్ని మృత్యువు వెంటాడింది. శుక్రవారం రాత్రి భజన కార్యక్రమం ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఆ బృందంలోని ఇద్దరు మార్గమధ్యంలో సంభవించిన ప్రమాదంలో మృత్యువాతపడగా మరో మహిళకు గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన జాతీయ రహదారిపై త్రిపురాంతకం మండలం ముడివేముల మెట్ట సమీపంలో కందుర్లవాగు వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు.. పల్నాడు జిల్లా శిరిగిరిపాడు గ్రామానికి చెందిన పోకలగంగ శ్రీనివాసరావు(50) శ్రీవీరాంజనేయస్వామి భజన బృందాన్ని నిర్వహిస్తున్నారు.
ఆలయాల్లో ఉత్సవాల సందర్భంగా కచేరీలు ఇస్తుంటారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా నూజెండ్ల మండలం భూమాయిపాలెం గ్రామంలో భజన కార్యక్రమం ముగించుకుని తమ బొలెరో వాహనంలో శిరిగిరిపాడు గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో శనివారం వేకువజామున అనంతపురం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భజన బృందంలోని సభ్యుడు సుందరయ్య(30) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన పోకలగంగ శ్రీనివాసరావును(50) వైద్యశాలకు తరలించగా అక్కడ మరణించారు.
మరో సభ్యురాలు పల్నాడు జిల్లా కొత్తపాలెం సమీపంలోని నాగిరెడ్డిపల్లికి చెందిన రమాదేవి గాయపడ్డారు. మృతుడు సుందరయ్య స్వగ్రామం పెద్దారవీడు మండలం కర్రోల కాగా భార్య, నలుగురు కుమార్తెలతో కలిసి యర్రగొండపాలెంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. తండ్రి మృతదేహం నలుగురు చిన్నారులు బిక్కుబిక్కుమంటూ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. సంఘటనా స్థలాన్ని సీఐ పాపారావు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుమన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment