ఇంటికి పది నిముషాల్లో చేరతారనగా.. కబళించిన మృత్యువు.. | - | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం.. అరె శాంసన్‌ ఒక్కసారి మమ్మల్ని చూడరా

Published Sun, Aug 20 2023 12:38 AM | Last Updated on Sun, Aug 20 2023 1:39 PM

- - Sakshi

ప్రకాశం: అర్ధరాత్రి వేళ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. శుక్రవారం అర్ధరాత్రి దాటి రెండు గంటలు కావస్తోంది. మార్కాపురంలోని కస్తూరిబా స్కూల్‌ దాటిన కొంత దూరంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం.. ఆ సమయంలో మార్కాపురం ఒంగోలు జాతీయ రహదారిపై ఒకటీ అర వాహనాలు వెళ్తున్నాయి. ఒక్కసారిగా ఆర్తనాదాలు వినిపించాయి. ముగ్గురు యువకులు రక్తపు మడుగుల్లో పడిఉన్నారు. కాపాడండి అంటూ వారి చేస్తున్న అరుపులు సమీపంలో ఉన్న కలుజువ్వలపాడు ఎస్సీ కాలనీ వాసులకు వినిపించటంతో నిద్రమత్తు వదిలించుకుని పరుగు పరుగున రోడ్డుపైకి వచ్చారు.

అప్పటికే ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. నెల్లూరు జిల్లా సంగం నుంచి ఇసుక లోడుతో వస్తున్న లారీ మార్కాపురం నుంచి అంబాపురానికి టూ వీలర్‌పై వెళుతున్న ముగ్గురు యువకులను ఢీకొనటంతో అక్కడికక్కడే వారు మృతి చెందారు. దీంతో మృతుల స్వగ్రామాలైన కొనకనమిట్ల మండలం అంబాపురం, పొదిలి మండలం సలకనూతల గ్రామాల్లో విషాదం నెలకొంది. అయితే అర్ధరాత్రి సమయంలో వివరాలు తెలిసే అవకాశం కనిపించలేదు. వెంటనే స్థానికులు పోలీసులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. హుటాహుటిన తర్లుపాడు ఎస్సై సుధాకర్‌, పొదిలి సీఐ రాఘవేంద్ర అర్ధగంట వ్యవధిలోనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి భయానకంగా ఉంది. మృతదేహాలు రోడ్డుకు అడ్డంగా ఉండటంతో ట్రాఫిక్‌ ఆగిపోయింది.

పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి మృతుల వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లు, ఆధార్‌కార్డుల ఆధారంగా కొనకనమిట్ల మండలం అంబవరం ఎస్సీ కాలనీకి చెందిన జమళ్లమూడి శాంసన్‌ (20), పెరిక వినోద్‌కుమార్‌ (20), పొదిలి మండలం సలకనూతలకు చెందిన ఇండ్ల నాని (17)గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 3 గంటల కల్లా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సంఘటన స్థలానికి చేరుకుని తమ పిల్లల మృతదేహాలను చూసి తల్లడిల్లారు. అప్పటి వరకు మార్కాపురం మండలంలోని రాజుపాలెం గ్రామంలో జరిగిన ఒక శుభకార్యక్రమంలో పాల్గొని విశేషాలు చెప్పి ఇళ్లకు బయలు దేరుతున్నామని ఫోన్‌లో చెప్పారు. ఇంతలోనే రోడ్డుపై మృతదేహాలుగా కనిపించటాన్ని జీర్ణించుకోలేకపోయారు.

కంటతడి పెడుతున్న అంబాపురం ఎస్సీ కాలనీ..
కొనకనమిట్ల మండలం వాగుమడుగు పంచాయతీ అంబాపురం, అంబాపురం ఎస్సీ కాలనీకి చెందిన పెరికె చినకోటయ్య కుమారుడు రాజేష్‌కు మార్కాపురం మండలం రాజుపాలెంలో వివాహం కుదిరింది. వివాహం నిమిత్తం జరిగే పప్పుభోజనాలకు చినకోటయ్య బంధువులు శుక్రవారం రాజుపాలెం వెళ్లారు. వారితో పాటు ముగ్గురు యువకులు పెరికె వినోద్‌, జమ్మలమూడి వీరేంద్ర, నాని మోటార్‌ సైకిల్‌పై వెళ్లారు.

రాత్రి అందరూ సంతోషంగా వివాహానికి సంబంధించిన వేడుకల్లో పాల్గొన్నారు. తిరిగి అంబాపురం ఎస్సీ కాలనీకి బయలు దేరగా మార్గమధ్యంలో మరో పది నిమిషాల్లో ఇంటికి చేరతారనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బేల్దారి పనులు చేస్తూ కుటుంబాలకు ఆర్థికంగా తోడుగా ఉండే యుక్త వయసు వచ్చిన యువకులు మృత్యువాత పడటంతో మృతుల కుటుంబాలతో పాటు ఎస్సీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.

హెల్మెట్‌ పెట్టుకుంటే బాగుండేది
హెల్మెట్‌ పెట్టుకుని ప్రయాణించి ఉంటే ముగ్గురూ ప్రాణాలతో ఉండేవారని సంఘటన స్థలాన్ని చూసిన వారు అభిప్రాయపడ్డారు. పోలీసులు ఎంత అవగాహన కల్పించినా వాహనదారులు హెల్మెట్‌లు పెట్టుకోకుండానే ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇంత రాత్రి వద్దన్నానయ్యా
‘‘నా కుమారుడు వినోద్‌కుమార్‌ అర్ధరాత్రి ఫోన్‌చేసి విశేషాలు చెప్పి బండిమీద నేను, శాంసన్‌, నాని కలిసి ఇంటికొస్తున్నామని చెప్పాడు. ఇంత రాత్రి వద్దని చెప్పినా వినకుండా వచ్చి ఈలోకాన్నే వదిలివెళ్లాడంటూ’’ వినోద్‌కుమార్‌ తండ్రి పెద్దకోటయ్య గుండెలవిసేలా రోదించారు. పెద్ద కోటయ్యకు వినోద్‌కుమార్‌తో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఒక్కడే కుమారుడు కావటంతో కుటుంబ సభ్యుల ఆశలన్నీ అతనిపైనే పెంచుకున్నారు. తన జీవితం చివరి దశలో ఆదుకుంటాడని భావిస్తే దేవుడు తమ కళ్ల ఎదుటే తమ కుమారుడిని తీసుకెళ్లాడని కన్నీటిపర్యంతమయ్యాడు.

8 గంటల పాటు రాస్తారోకో
మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని దళిత సంఘాలతో పాటు గ్రామ సర్పంచ్‌ శిఖామణి సోదరుడు ఆధ్వర్యంలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో ఒంగోలు–మార్కాపురం రహదారికి అటుఇటు 10 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను డైవర్షన్‌ చేశారు.

శాంసన్‌ ఒక్కసారి చూడరా..
అరె శాంసన్‌ ఒక్కసారి మమ్మల్ని చూడరా అంటూ కుమారుడి మృతదేహాన్ని పట్టుకుని శాంసన్‌ తల్లిదండ్రులు దావిదు, బుజ్జమ్మ ఎడ్చిన తీరు అక్కడ ఉన్న ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఒక్కసారి మాట్లాడతానని తల్లిదండ్రులు తమ కుమారుడి గడ్డాన్ని పట్టుకుని వేడుకుంటుంటే ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరూ ఆవేదన చెందారు.

ఇలా జరుగుతుందని అనుకోలేదు
అర్ధరాత్రి సమయంలో పోలీసులు ఫోన్‌చేశారు. చిన్న ప్రమాదం జరిగిందని చెప్పారు. తీరా ఇక్కడికి వస్తే నా కుమారుడు నాని విగతజీవుడై కనిపించాడు. ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. దేవుడు ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదు. నాకు నా కుటుంబానికి దిక్కెవరయ్యా.
– షడ్రక్‌, నాని తండ్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement