![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/31/6588.jpg.webp?itok=WSy2LoCg)
మార్కాపురం రూరల్: తన బంధువులకు ప్రమాదం జరిగిందని ఫోన్ వార్త తెలియగానే హడావుడిగా వారిని పరామర్శించి కాపాడుదామని ఉద్దేశంతో వెళ్లిన యువకుడ్ని మృత్యువు కబళించింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి మార్కాపురం మండలం తిప్పాయపాలెం–జంగంగుంట్ల గ్రామాల మధ్య జరిగింది.
కంభం పట్టణానికి చెందిన మౌలాలి, అభిథ్ లు వ్యక్తిగత పనిమీద ఆదివారం వినుకొండకు వెళ్లారు. తిరిగి తమ ద్విచక్ర వాహనంపై వస్తుండగా మార్కాపురం మండలం తిప్పాయపాలెం–జంగంగుంట్ల మధ్య గేదెలు అడ్డుగా వచ్చి బైకును ఢీకొన్నాయి. దీంతో వారిరువురికి గాయాలయ్యాయి. వారు ఈ విషయాన్ని కంభంలో ఉన్న తన బంధువు షేక్ రసూల్‌కు, ఇలియాజ్‌కు తెలిపారు. ప్రమాదంలో ఉన్న వారిద్దరినీ కాపాడేందుకు రసూల్ తన మిత్రుడైన ఇలియాజ్‌ను తీసుకొని టూ వీలర్ పై సంఘటన స్థలానికి బయలుదేరాడు.
అయితే ప్రమాదం జరిగిన స్థలానికి దగ్గర్లో వీరి వాహనాన్ని కూడా గేదెలు ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇలియాజ్ కు బలమైన గాయాలు కావడంతో కంభం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఇలియాజ్ (27) మృతి చెందాడు. మృతుడి తండ్రి మహబూబ్ పిరా కంభం ఆర్టీసీ కంట్రోలర్ గా పని చేస్తున్నాడు. సహాయం చేయబోయి తన కుమారుడే మృతి చెందడం పట్ల ఆ కుటుంబం కన్నీరు మున్నీరైంది.
Comments
Please login to add a commentAdd a comment