
పరీక్షల విధుల్లో అలసత్వం వహించొద్దు
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ విధుల్లో ఎంత మాత్రమూ అలసత్వం, నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఏకేవీకే డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియెట్ పరీక్షల విధుల్లో పాల్గొనే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, కస్టోడియన్లు, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, స్క్వాడ్ సభ్యులకు ఆదివారం జరిగిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా కేంద్రాల పరీక్షల నిర్వహణలో మీదే కీలక పాత్ర అన్నారు. పరీక్ష కేంద్రంపై చీఫ్ సూపరింటెండెంట్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని చెప్పారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలన్నారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరాదన్నారు. తనిఖీలు, పరీక్షల నిర్వహణలో పకడ్బందీగా ఉండాలని, అలాగని విద్యార్థులు ఒత్తిడికి గురయ్యేలా వారి పట్ల అనుచితంగా వ్యవహరించరాదని చెప్పారు. తమ కేంద్రాల్లో పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్లదేనన్నారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి జిల్లా యంత్రాంగానికి అప్రతిష్ట తీసుకువస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణకు సమయం ఉన్నందున ఆయా పరీక్ష కేంద్రాలపై అవగాహన కోసం ముందుగానే వెళ్లి పరిశీలించాలని అందరికీ దిశానిర్దేశం చేశారు. హాల్ టికెట్లపై విద్యార్థులు చదువుతున్న కాలేజీల ప్రిన్సిపాల్ సంతకం కచ్చితంగా ఉండాలనే నిబంధన ఏమీ లేదన్నారు. హాల్ టికెట్లు మంజూరు చేయాలంటే పెండింగులో ఉన్న కాలేజీ / మెస్ ఫీజు చెల్లించాలని విద్యార్థులపైన ప్రైవేట్ కాలేజీలు ఒత్తిడి తెస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాట్సప్ ద్వారా విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో ఆర్.ఐ.ఓ. సైమన్ విక్టర్, ఇంటర్మీడియెట్ పరీక్షల స్పెషల్ ఆఫీసర్ ఐ.శ్రీనివాసరావు, ఎగ్జామ్స్ కంట్రోలర్ వి.వి.సుబ్బారావు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు ఆంజనేయులు, చంద్రశేఖర్, కోటేశ్వరరావు, స్వరూప రాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పరీక్షల విధుల్లో అలసత్వం వహించొద్దు
Comments
Please login to add a commentAdd a comment