బీజేపీ పాలనలో మహిళలపై దాడులు
ఒంగోలు టౌన్: బీజేపీ ప్రభుత్వంలో మహిళలు, మహిళా హక్కులపై దాడులు పెరిగిపోయాయని ప్రగతిశీల మహిళా సంఘ జాతీయ కన్వీనర్ వి.సంధ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి మనువాదాన్ని ప్రోత్సహించే బీజేపీ ప్రభుత్వం రావడంతో పితృస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతమైందని, దళితులు, మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. నగరంలోని ఎన్జీఓ హోంలో శనివారం నిర్వహించిన ప్రగతిశీల మహిళా సంఘాల విలీనసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోనే కాకుండా భారతదేశంలో కూడా నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని చెప్పారు. అయినప్పటికీ పురుషుల కంటే మహిళల హోదా తక్కువగా ఉందన్నారు. మహిళలు శక్తివంతంగా పోరాడుతున్నప్పటికీ వారి మీద జరుగుతున్న లైంగికదాడులు ఆగలేదన్నారు. హత్రాస్‌లో దళిత బాలిక, మణిపూర్‌లో గిరిజన మహిళ, బెంగాల్లో పీజీ డాక్టర్‌పై జరిగిన ఘటనలే దీనికి నిదర్శనమన్నారు. దేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే లక్షల మంది ఆకలి చావులకు బలవుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం మనిషికి ఐదు కిలోల లెక్కన బియ్యం సరఫరా చేసి ఇంట్లో ఆఖరి ముద్ద తినే మహిళలను మరింతగా ఆకలికి గురిచేస్తోందన్నారు. కొత్తగా వచ్చిన లేబర్ కోడ్ చట్టాలు మహిళా కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, వ్యవసాయ కూలీల వేతనాలు అమలు జరగడం లేదని అన్నారు. సభలో పీఓడబ్ల్యూ జాతీయ కో ఆర్డినేటర్ ఝాన్సీ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమాసుందరి మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నా, సమాన హోదా కావాలన్నా, దోపిడీ రహిత సమాజం నిర్మాణం జరగాలన్నా మహిళలు మరింత క్రియాశీలకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సభలో విష్టు, గంగా భవాని, బి.పద్మ, ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ప్రగతిశీల మహిళా సంఘాల విలీన సభలో జాతీయ కన్వీనర్ సంధ్య ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment