మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలి
● జిల్లా ఫ్రధాన న్యాయమూర్తి భారతి
ఒంగోలు: మహిళలు అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా న్యాయస్థానం ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయసేవాధికార సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. సెలవులతో సంబంధం లేకుండా నిరంతరం పనిచేసే శక్తి మహిళా శక్తి అని అభివర్ణించారు. పురుషులతో సమానంగా శ్రమిస్తున్నప్పటికీ సామాజికంగా చిన్న చూపు చూడటం తగదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూనే ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి సాధించడం ద్వారా శక్తివంతంగా మరింత ముందుకు వెళ్లవచ్చన్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో లైంగిక దోపిడీ జరిగినట్లయితే సంబంధిత కమిటీకి తమ సమస్యను తెలియజేసి తగిన విధంగా పరిష్కారం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు డి.అమ్మన్నరాజా, డి.రాములు, జి.దీన, కె.శైలజ, సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి ఎస్.హేమలత, జూనియర్ సివిల్ న్యాయమూర్తులు పి.భానుసాయి, ఎస్.కోమలవల్లి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment