
ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధి లేదు
● వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ
ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: ఎస్సీ వర్గీకరణపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వర్గీకరణపై బిల్లు చేయకుండా కేవలం ఆర్డినెన్స్ జారీ చేయటమే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. సింగరాయకొండలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల వైఎస్సార్ సీపీకి మొదటి నుంచి చిత్తశుద్ధి ఉందన్నారు. తాము ఎప్పుడూ ఒకేమాట మీద ఉన్నామన్నారు. సుప్రీం కోర్టు జడ్జిమెంటు ప్రకారం అందరికీ మేలు జరగాలన్న విషయంలో నిస్పక్షపాతంగా వ్యవహరించాలన్నదే తమ పార్టీ లక్ష్యమన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీలకు నామినేటెడ్ పోస్టులు, మంత్రి పదవులు, కార్పొరేషన్ పదవులు, సంక్షేమ పథకాలు దామాషా ప్రకారం ఇచ్చామని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంటు అమలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం అసెంబ్లీ సమావేశాల్లో తేటతెల్లమైందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చట్టం చేశాం, ఒక కమిటీని వేశాం, ఈ విధంగా కమిటీ నివేదిక ఇచ్చిందని చట్టసభల్లో ప్రవేశపెట్టి చర్చకు అవకాశం ఇచ్చేవారన్నారు. ఒక చట్టసభలో మొదటగా బిల్లు ప్రవేశపెట్టడం, తరువాత దానిపై చర్చ జరపటం చివరగా బిల్లు పాస్ చేసి ఆమోదానికి గవర్నర్‌కు పంపడం ఇది పద్ధతి అని.. ఈ పద్ధతిని తెలంగాణ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేసిందని గుర్తు చేశారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఒక లైను స్టేట్‌మెంటు ఇచ్చారన్నారు. అసెంబ్లీలో చట్టం చేయకుండా బిల్లు ప్రవేశపెట్టకుండా అసెంబ్లీ అయిపోయిన తరువాత గవర్నర్‌కు పంపించి ఆర్డినెన్స్ తీసుకుని వచ్చి తరువాత చేద్దామని చెప్పటమేంటని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లు ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉందన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు రిజర్వేషన్ విధానాన్ని, రోస్టర్ పాయింట్లును ప్రశ్నిస్తున్నారన్నారు. జిల్లా యూనిట్‌గానా, రాష్ట్రం యూనిట్‌గా తీసుకుంటారో చెప్పాల్సి ఉందని, మళ్లీ 2025–26 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ పద్ధతి మారుస్తామని చెబుతున్నారని డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన వెంట పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సుల్తాన్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు యనమల మాధవి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చుక్కా కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment