మెగా డీఎస్సీ ఉచిత ఆన్‌లైన్ శిక్షణ
ఒంగోలు సిటీ: మెగా డీఎస్సీ 2025 పరీక్షల ఉచిత ఆన్‌లైన్ శిక్షణకు ప్రకాశం జిల్లాకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్(ఈబీసీ) అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఒంగోలు సంచాలకులు ఎం.అంజల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సంచాలకులు అంజల మాట్లాడుతూ డీఎస్సీ ఆన్‌లైన్ శిక్షణకు ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్హత నకళ్లు, టెట్ మార్కుల నకళ్లు, కులధ్రువీకరణ పత్రం నకలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం నకలు, ఆధార్ నకలు, 2 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్‌లో ఉన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఒంగోలు లోని ఆఫీసు ఫోన్ నంబరు 08592–231232, 9989285530, 89850 90926 నంబర్లను సంప్రదించగలరని తెలిపారు.
అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి దరఖాస్తులు
ఒంగోలు సిటీ: భారత రక్షణశాఖ త్రివిధ దళాల రిక్రూట్‌మెంట్‌లో విప్లవాత్మక సంస్కరణల కోసం అగ్నిపథ్ పథకంలో భాగంగా భారత ఆర్మీలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ విభాగాల్లో ఉద్యోగ నియామకాలకు అర్హులైన యువకులు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ పదో తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సీఈఓ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఈ ఉద్యోగాల నియామకానికి రాత పరీక్ష తెలుగులో నిర్వహిస్తారన్నారు. అలాగే ఎన్‌సీసీ ఏ, బీ, సీ సర్టిఫికెట్లు ఉన్నవారు, క్రీడాకారులకు ప్రత్యేక బోనస్ మార్కులు ఉంటాయని తెలిపారు. www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
బధిరుల సంఘ నూతన కార్యవర్గం ఎంపిక
ఒంగోలు వన్‌టౌన్: బధిర సంఘం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్బంగా నూతన కార్యవర్గం సోమవారం జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ ఆర్చనను ఏడీ చాంబర్‌లో కలిశారు. ఏడీని కలిసిన వారిలో సంఘం అధ్యక్షుడు యం రాజేంద్ర, ఉపాధ్యక్షుడు సీహెచ్ ఏడుకొండలు, ప్రధాన కార్యదర్శి యం.నాగిరెడ్డి, కోశాధికారి యం సునీల్, సంయుక్త కార్యదర్శి జీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్బన్ ప్రాపర్టీస్ డిజిటలైజేషన్
ఒంగోలు సబర్బన్: అర్బన్ ప్రాపర్టీస్ డిజిటలైజేషన్ చేయటానికి ఒంగోలు నగర పాలక సంస్థ ఎంపికై ందని నగర కమిషనర్ కే.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలను ఎంపిక చేసిందని, వాటిలో ఒంగోలు కూడా ఉందన్నారు. నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ సర్వే ఇన్ హేబిటేషన్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ (నక్షా) ప్రోగ్రాం కింద కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. డిజిటలైజేషన్ పూర్తి చేసుకున్న నగర పాలక సంస్థలకు మూడు విడతలుగా రూ.30 కోట్లు ఇన్‌సెంటివ్‌గా అందిస్తుందన్నారు. ఈ పథకం కింద ఒంగోలు నగర పాలక సంస్థలోని హేబిటేషన్స్ అన్నీ డ్రోన్ కెమెరాతో ఇమేజెస్ తీసుకుంటారన్నారు. ఈ ఆర్ధో రెక్టిఫైడ్ ఇమేజ్ (ఓఆర్‌ఓ) ఆధారంగా ఇంటింటి సర్వే నిర్వహించటానికి టీములు ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. ఈ టీములు రోజువారీ నిర్దేశిత ప్రాంతాల్లో ఓఆర్‌ఐ ఆధారంగా ఇంటింటి పాలిగాన్స్‌ను తయారు చేస్తారన్నారు. దీనిని గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ అంటారు. దీనికి సుమారు 45 రోజులు పడుతుందన్నారు. ఈ నక్షా పథకం వలన ప్రజల ఆస్తులకు రక్షణ ఉండటమే కాక సరిహద్దుల గొడవలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని వివరించారు. ఈ నెల 26వ తేదీ నుంచి రోవర్ల సహాయంతో సర్వేకు వచ్చే సెక్రటరీల టీమ్‌కు ప్రజలు సహకరించాల్సిందిగా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment