
మెరిట్ కం రోస్టర్ విధానంలో సీనియార్టీ జాబితాలుండాలి
● బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకుల డిమాండ్
ఒంగోలు సిటీ: ఉపాధ్యాయ సీనియారిటీ జాబితాలు మెరిట్ కం రోస్టర్ విధానంలో తయారు చేయాలని బీటీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏల్చూరి మాధవరావు అన్నారు. బహుజన్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కర్ర దేవ సహాయం అధ్యక్షత వహించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏల్చూరి మాధవరావు మాట్లాడుతూ జిల్లా పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకటించారన్నారు. ఆ జాబితాలు కేవలం మెరిట్ ఆధారంగా తయారు చేశారని, వాటి వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్ని వర్గాల మహిళలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు. జాబితాలు వెంటనే సవరించాలని ఆయన కోరారు. ఈ విషయంపై సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారులతో చర్చించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పర్రె వెంకట్రావు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి మెరిట్ కం రోస్టర్ విధానం కోసం బహుజన టీచర్స్ అసోసియేషన్ పోరాటం చేస్తోందని, బహుజన ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణ బీటీఏ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఉద్యోగులకు 30 శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలని, 12 వ వేతన సవరణ సంఘాన్ని నియమించాలని కోరారు. సరెండర్ లీవ్స్ ఇంత వరకు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో చర్చించి సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యక్ష కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పారాబత్తిన జాల రామయ్య, రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల శరత్ చంద్రబాబు, జిల్లా నాయకులు జగన్నాథం ప్రసాదరావు, గంటనపల్లి శ్రీనివాసులు, నూకతోటి కుమారస్వామి, కొండమూరి కొండల రాయుడు, చెక్క కోటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.