ఒంగోలు సిటీ: సమగ్రశిక్షా రాష్ట్ర కార్యాలయ ఉత్తర్వుల మేరకు 2025–26 సంవత్సరానికి గాను తరల్ ఎండ్ లైన్ పరీక్షను ఈ నెల 26, 27వ తేదీల్లో 3, 4, 5వ తరగతి చదువుతున్న పిల్లలకు తెలుగు, గణితం సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించాలని డీఈఓ కిరణ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ ఈ పరీక్ష నిర్వహించడానికి అవసరమైన సూచనలు, ప్రశ్నపత్రాలు ఇప్పటికే పంపారన్నారు. మండల విద్యాధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంబంధిత ఉపాధ్యాయులకు తరల్ ఎండ్ లైన్ పరీక్ష నిర్వహించడానికి తగిన సూచనలు ఇచ్చి పూర్తి చేయించాల్సిందిగా ఆదేశించారు. తరల్ ఎండ్ లైన్ పరీక్ష నిర్వహణలో కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలన్నారు. ప్రతి విద్యార్థికి బేస్ లైన్, మిడ్ లైన్ పరీక్ష ల్లో వాడని 4 శాంపిళ్లలో ఏదైనా ఒక శాంపిల్ ను మాత్రమే ఎండ్ లైన్ లో ఇవ్వాలన్నారు. పరీక్ష నిర్వహణ అనంతరం మార్కులు అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
ఆస్తి పన్నుపై 50 శాతం
వడ్డీ రాయితీ
ఒంగోలు సబర్బన్: ఆస్తి పన్నుపై 50 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రత్యేకంగా జీఓ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్స్‌పల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ జీఓ నంబరు–46 విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అందుకుగాను రాష్ట్ర కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఉత్తర్వులు పంపింది. 2024–25 ఆర్ధిక సంవత్సరం వరకు ఉన్న ఆస్తి పన్ను బకాయిలకు సంబంధించి ఈ జీఓ ఉపకరిస్తుందని ఒంగోలు నగర కమిషనర్ డాక్టర్ కే.వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు ఆయన మార్చి 31వ తేదీలోపు ఆస్తి పన్ను బకాయిలు చెల్లించిన వారికి ఈ వడ్డీ రాయితీ వర్తిస్తుందన్నారు. కనుక ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
సంస్కృతాన్ని రెండో భాషగా కొనసాగించాలి
● ఏపీఎస్‌ఎల్‌ఏ ఒంగోలు డివిజన్ సభ్యుల డిమాండ్
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సంస్కృతాన్ని రెండో భాషగా ప్రస్తుతం ఉన్నట్లు కొనసాగించాలని జిల్లా సంస్కృత లెక్చరర్ల అధ్యక్షుడు జి.కృష్ణ, వై.రమేష్ కోరారు. మంగళవారం ఏకేవీకే కళాశాలలో ప్రకాశం జిల్లా సంస్కృత లెక్చరర్ల అసోసియేషన్ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపి, అనంతరం ఆర్‌ఐఓ సైమన్ విక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సంస్కృతం ఎలా ఉందో అదే విధంగా సెకండ్ లాంగ్వేజ్‌గా కొనసాగించాలన్నారు. వందల, వేల మంది ఉపన్యాసకులంతా ప్రైవేట్ కళాశాలల్లో, కార్పొరేట్ కళాశాలల్లో పనిచేస్తున్నారన్నారు. ఇంతటి విలువైన సంస్కృతాన్ని ఆప్షన్ గా పెట్టాలనే ఆలోచన మంచిది కాదన్నారు. ఆప్షన్ సబ్జెక్టు పెట్టి అది పాస్ అవ్వకపోయినా పరవాలేదు అని అన్నప్పుడు విద్యార్థులు సంస్కృతాన్ని తీసుకోరనీ, ఈ విధానం సరైనది కాదన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ప్రసాదు, శ్రీనివాసరెడ్డి, రఘు, సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఏపీ బీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉమాకాంత్
కనిగిరిరూరల్: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర కార్యదర్శిగా కనిగిరికి చెందిన మారెళ్ల ఉమాకాంత్ నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ ఆదేశాల మేరకు సంఘ ప్రధాన కార్యదర్శి మనోహర్‌రావు నుంచి మంగళవారం నియామక ఉత్తరు్‌ువ్ల వచ్చినట్లు తెలిపారు. ఉమాకాంత్ కనిగిరి బ్రాహ్మణ సంఘానికి రెండు సార్లు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన నియామకం పట్ల బ్రాహ్మణ సంఘ మాజీ అధ్యక్షుడు మాచవరపు సుబ్రహ్మణ్యం, పరశు సత్యగోపాల్, సంఘ నాయకులు మతుకుమల్లి భాస్కర్, మనోహర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.