ఆహారం.. ఆరోగ్యం.. ఆదాయం.. | - | Sakshi
Sakshi News home page

ఆహారం.. ఆరోగ్యం.. ఆదాయం..

Published Sun, Dec 15 2024 12:38 AM | Last Updated on Sun, Dec 15 2024 4:39 PM

కరీంనగర్‌లోని తిరుమల్‌నగర్‌లో తయారవుతున్న గానుగ నూనె

కరీంనగర్‌లోని తిరుమల్‌నగర్‌లో తయారవుతున్న గానుగ నూనె

ఉరుకులు పరుగుల జీవితం.. తీరిక లేని జీవనం మనుషుల అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. కాస్త నడిస్తే ఆయాసం, కొంచెంఎక్కువ తింటే మధుమేహం, రక్తపోటు, థైరా యిడ్‌ చిన్న వయసులోనే బాధ పెడుతున్నాయి. దీనంతటికీ కారణం కల్తీ. నూనెలు మొదలు తినే ప్రతీ ఆహార పదార్థం కల్తీమయం అవుతోంది. దీంతో కొద్దికాలంగా మనుషుల ఆలోచన తమ ఆరోగ్యం వైపు మళ్లుతోంది. ఎలాంటి రసాయనాలు లేని నాటికాలపు ఆహారం తీసుకునేందుకు మక్కువ చూపుతున్నారు. కొందరు ఇళ్లలోనే తయారు చేసుకుంటుంటే.. మరికొందరు బయట కొనుగోలు చేస్తున్నారు. 

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలుచోట్ల ప్రజల అలవాట్లను పలువురు వ్యాపారంగా మలుచుకుని ఎద్దుల సాయంతో గానుగ ఆడించి నువ్వులు, పల్లీలు, పొద్దుతిరుగుడు, కుసుమ నూనె తయారు చేస్తున్నారు. హెల్తీ జ్యూస్‌, అంబలి, చిరుధాన్యాల రూపంలో సేంద్రియ ఆహారం అందిస్తూ.. ఆరోగ్యాన్ని పంచుతున్నారు. వారూ ఆదాయంగడిస్తు న్నారు. అలాంటివారిలో కొందరిపై సండే స్పెషల్‌..!!

రాగి అంబలి..

జగిత్యాల అగ్రికల్చర్‌: చిరుధాన్యాలతో తయా రు చేసిన అంబలికి రోజురోజుకూ ప్రాధాన్యత పెరుగుతోంది. ఇది గమనించిన జగిత్యాలకు చెందిన రాపర్తి మహేశ్‌ స్థానిక మినిస్టేడియం వద్ద నాలుగేళ్లుగా రాగి అంబలి గ్లాస్‌ రూ.10కే విక్రయిస్తున్నాడు. వాకర్స్‌తోపాటు కూరగా యల మార్కెట్‌కు వచ్చే రైతులు కొనుగోలు చేస్తున్నారు. అంబలిలో నిమ్మకాయ రసం, ఎల్లిపాయ కారం, మిరియాల పొడి, క్యారెట్‌, పెసర మొలకలు వేసి ఇస్తుండటంతో చాలా మంది ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు. కరోనా కాలం నుంచి అంబలి అమ్ముతూ పుపాధి పొందుతున్నట్లు మహేశ్‌ తెలిపాడు.

మిల్లెట్‌ మార్ట్‌

జమ్మికుంట(హుజూరాబాద్‌): జమ్మికుంటకు చెందిన గుజ్జ హరీశ్‌రావు స్థానికంగా నృసింహ మిల్లెట్‌ మార్ట్‌ను ప్రారంభించాడు. చిరుధాన్యాలైన అరికలు, ఉదలు, సామలు, కొర్రలు, అండుకొర్రలతో జావ, రాగి అన్నం, చపాతి, పచ్చజొన్న, గటుక, బటర్‌ మిల్క్‌, లస్సీ, మిల్క్‌షేక్‌, అంబలి తయారు చేసి, విక్రయిస్తున్నాడు. ఇవి కేన్సర్‌, డయాబెటిస్‌, నీరసం, బీపీ, ఫ్యాట్‌, కడుపులో మంటను అదుపులో ఉంచుతాయి. ఖాదర్‌ వలీ అనే ప్రైవేట్‌ సైంటిస్ట్‌ ఆరోగ్య సూత్రాలను ఆదర్శంగా తీసుకొని, 6 నెలల క్రితం ఈ మార్ట్‌ ఏర్పాటు చేశానని, ఖర్చులన్నీ పోను నెలకు రూ.30 వేల వరకు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడు.

హెల్తీ జ్యూస్‌

సిరిసిల్లటౌన్‌: సిరిసిల్లకు చెందిన మేర్గు రమాదేవి–సత్యనారాయణ దంపతులు లాభాపేక్ష లేకుండా పది మందికి ఆరోగ్యాన్ని పంచుతున్నారు. తమ గురువుల నుంచి పొందిన ఆరోగ్య పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఏడాదిగా ఇంట్లోనే గుమ్మడి, సొరకాయ, బీట్‌రూట్‌, కాకరకాయ, క్యారెట్‌ తదితర జ్యూస్‌లు ఉదయాన్నే తయారు చేసి, విక్రయిస్తున్నారు. రూ.10కే హెల్తీ జ్యూస్‌ లభిస్తుండటంతో వాకర్స్‌, యోగా సాధకులు, విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు కొనుగోలు చేసి, తాగుతున్నారు. గుమ్మడికాయ జ్యూస్‌ తీసుకుంటే మేధోశక్తి పెరుగుతుందని, మిగతా కాయలు, పండ్లతో చేసిన రసాలతోనూ చాలా ఉపయోగాలు ఉన్నాయని సత్యనారాయణ తెలిపారు.

ధాన్యం మొలకలు

జగిత్యాల అగ్రికల్చర్‌: మొలకెత్తిన గింజల్లో పోషకాలు ఎక్కువ ఉండటంతో ఇటీవల ప్రజల చూపు వాటిపై పడింది. దీంతో, జగిత్యాలకు చెందిన మొగిలి నవీన్‌ కారు డ్రైవర్‌గా పని చేస్తూనే, ప్రతీరోజు ఉదయం వివిధ రకాల ధాన్యం మొలకలు అమ్ముతున్నాడు. స్థానిక రైతు బజార్‌ కూరగాయల మార్కెట్‌, మినిస్టేడియానికి వెళ్లే దారిలో శనగలు, బఠాణీలు, వేరుశనగ, కందులు, పెసలు, బబ్బెర్లు.. తదితరాల మొలకలు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. రోజుకు 6 నుంచి 7 కిలోల వరకు అమ్ముతూ ఉపాధి పొందుతున్నట్లు పేర్కొన్నాడు. వాకింగ్‌కు, కూరగాయల కోసం వచ్చేవారు కొనుగోలు చేస్తున్నారని తెలిపాడు.

గానుగ నూనె 

కరీంనగర్‌/జ్యోతినగర్‌(రామగుండం): కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని తిరుమల్‌నగర్‌లో యువ రైతు మదుసూదన్‌రెడ్డి వేద ఆర్గానిక్స్‌ పేరిట గానుగ నూనెలు, సేంద్రియ ఆహార ఉ త్పత్తులు విక్రయిస్తున్నా డు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఒక గానుగ కేంద్రాన్ని, హైదరాబాద్‌ మెయిన్‌ రోడ్‌ పొన్నాల దాబా వద్ద మరొకటి ప్రారంభించాడు. ప్రత్యక్షంగా 15 మందికి, పచ్చళ్లు, మొలకలు, ఇతరత్రా ఉత్పత్తులు తయారు చేయిస్తూ మహిళా గ్రూపుల సభ్యులు మరో 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. కళ్లముందే నూనె పట్టి ఇస్తుండటంతో కొనుగోలుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. 

పల్లి నూనె రూ.400, నువ్వుల నూనె రూ.600కు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో 2020 నుంచి గానుగ నూనె తయారు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ రామగుండం న్యూపోరట్‌పల్లికి చెందిన రవళిక శ్రీ రాజరాజేశ్వర కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్‌ పేరిట గానుగ నూనె తయారు చేస్తోంది. ఇందుకోసం వాడే పరికరాలు రోకలి దుడ్డు, రోలు చెక్కతో చేసినవే కా వడంతో నూనె వేడెక్కకుండా పోషకాలు అలా గే ఉంటాయి. పల్లి, నువ్వులు, కొబ్బరి, కుసు మ నూనె కావాల్సినవారు 79959 29170 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

చిరుధాన్యాలతో టిఫిన్స్‌

కోరుట్ల: స్థానిక కొత్త మున్సిపల్‌ వద్ద అంగ రాజేందర్‌ చిరుధాన్యాల టిఫిన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాడు. నిత్యం ఉదయం 6 గంటల నుంచి రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలతో చేసిన టిఫిన్స్‌ విక్రయిస్తున్నాడు. కల్తీ లేకపోవడం, ఆరోగ్యదాయకం కావడంతో చాలామంది ఇక్కడికి వచ్చి, టిఫిన్‌ చేస్తున్నారు. రాగులు, సజ్జల్లో జీవక్రియలకు ఉపయోగపడే ఐరన్‌, మెగ్నీషియం, జింక్‌, కాల్షియం ఉంటాయని, తన భార్య కళావతితో కలిసి నిత్యం టిఫిన్స్‌ తయారు చేస్తున్నట్లు రాజేందర్‌ తెలిపాడు. సాధారణ టిఫిన్ల ధరనే తీసుకుంటుండంతో ఎక్కువ మంది వస్తున్నారని పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement