కరీంనగర్: ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పలువురు బీసీ నేతలు ఉన్నారు. వీరిలో అధిక శాతం బలమైన సామాజిక నేపథ్యం, ఉన్నత విద్యావంతులు, రాజకీయ అనుభవం కలిగినవారే కావడం విశేషం. మున్నూరుకాపు సామాజికవర్గం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటం గమనార్హం. వీరే కాక, పద్మశాలీ, గౌడ, ముదిరాజ్, యాదవ తదితర బలమైన సామాజికవర్గాల నుంచి రాజకీయ ఆశావహులు బరిలో నిలుస్తున్నారు.
నోటిఫికేషన్‌కు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో మరింత మంది బీసీ లు అసెంబ్లీ బరిలోకి దిగుతారని సమాచారం. స్థానికత, బీసీ నినాదం, పార్టీ చరిష్మా, మార్పు తదితర అంశాలు తమ విజయానికి దోహదపడతాయని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలు పోటీ పడుతున్న నియోజవకర్గాలను ఒకసారి పరిశీలిద్దాం..
వేములవాడ: ఇక్కడి నుంచి గత నాలుగు పర్యాయాలుగా పోటీ చేస్తున్న ఆది శ్రీనివాస్(కాంగ్రెస్) ఈసారి కూడా బరిలో ఉన్నారు. మున్నూరుకాపు కావడం, దాదాపు 30 వేల పైచిలుకు ఓట్లు తన సామాజికవర్గానికి చెందినవే ఉండటంతో విజయంపై ధీమాగా ఉన్నారు.
అదే సామాజికవర్గానికి చెందిన డాక్టర్ గోలి మోహన్ బీఎస్పీ నుంచి పోటీలో ఉన్నారు. కురుమ సామాజికవర్గానికి చెందిన తుల ఉమ బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. యాదవులు, కురుమల ఓట్లు 25 వేల వరకు ఉన్నాయని, విజయం సాధిస్తానని భావిస్తున్నారు.
కోరుట్ల: బీజేపీ నుంచి బీసీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బరిలో ఉన్నారు. తన అమ్మమ్మ బంధుగణం, స్నేహితులు, సన్నిహితులు ఇక్కడే ఉండటం, బలమైన మున్నూరుకాపు సామాజికవర్గం, వారివి 26 వేల ఓట్లు ఉండటం మిగిలిన బీసీ కులాలూ మద్దతిస్తారని అర్వింద్ వర్గం ధీమాగా ఉంది. వీటికితోడు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న హామీ తన విజయానికి దోహదపడుతుందని అంటున్నారు.
జగిత్యాల: బీజేపీ నుంచి పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన భోగ శ్రావణి బరిలో ఉన్నారు. సొంత సామాజికవర్గానికి చెందిన 20 వేల ఓట్లు, ప్రధాని మోదీ చరిష్మా, బీసీ నినాదం, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తాయని ఆమె వర్గం అంటోంది.
కరీంనగర్: బీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ బరిలో ఉన్నారు. రాష్ట్రంలోనే బలమైన బీసీ నేతగా గుర్తింపు పొందారు. మూన్నూరుకాపు సామాజికవర్గం కావ డం, నియోజకవర్గంలో దాదాపు 40 వేల పైచి లుకు వారివే ఓట్లు ఉండటం, కేబుల్ బ్రిడ్జి, స్మార్ట్‌సిటీ, మానేరు రివర్‌ఫ్రంట్, సంక్షేమ పథకాలు నాలుగోసారి శాసనసభకు పంపుతాయని గంగుల అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు.
మరోవైపు బీజేపీ నుంచి బరిలో నిలవనున్న ఎంపీ బండి సంజయ్ కూడా ఇదే సామాజికవర్గం కావడం గమనార్హం. రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసిన తీరు, హిందుత్వ నినాదం, కేంద్ర నిధులు, ప్రధాని మోదీ చరిష్మా తదితరాలు కలిసివస్తాయని ధీమాగా ఉన్నారు.
హుజూరాబాద్: ఏడుసార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ మరోసారి బరిలో నిలవనున్నారు. బలమైన ముదిరాజ్ సామాజికవర్గం కావడం, నియోజకవర్గంలో వారివే 26 వేల ఓట్లు ఉండటం, మంత్రిగా గతంలో ఇక్కడ చేసిన అభివృద్ధి పనులతో తనకు మరోసారి ప్రజా ఆశీర్వాదం లభిస్తుందని విశ్వసిస్తున్నారు.
రామగుండం: ఇక్కడ విచిత్ర పరిస్థితి నెలకొంది. పోటీ చేసే నాయకులంతా బీసీలే. కోరుకంటి చందర్(బీఆర్‌ఎస్), సోమారపు సత్యనారాయణ ఇద్దరూ బలమైన మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందినవారు. ఈ ఓట్లు నియోజకవర్గంలో దాదాపు 24 వేలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న మక్కాన్ సింగ్ ఠాకూర్ కూడా బీసీనే. బీసీ నినాదంతోపాటు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన, సింగరేణి ప్రైవేటీకరణ, ప్రభుత్వ వ్యతిరేకత తనను గెలిపిస్తాయని పేర్కొంటున్నారు.
మంథని: అధికార పార్టీ నుంచి పుట్ట మధు మరో సారి బరిలో నిలవనున్నారు. బలమైన మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడం, వీరి ఓట్లు దాదాపు 29 వేలు ఉన్నాయి. స్థాని కుడు, బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి గెలిపిస్తాయని ఆయన వర్గం భావిస్తోంది.
పెద్దపల్లి: బీఎస్పీ నుంచి పెద్దపల్లి అభ్యర్థిగా బరిలో దిగుతున్న దాసరి ఉషది పద్మశాలీ సామాజికవర్గం. బహుజన నినాదంతో ముందుకు సాగుతున్న ఈ ఐఐటీయన్ సొంత సామాజికవర్గం ఓట్లు దాదాపు 35 వేలు వరకు ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత, మార్పునకు శ్రీకారం, విద్యావంతుల మద్దతు తదితర అంశాలు గెలిపిస్తాయని ఆమె వర్గం ధీమాగా ఉంది.
హుస్నాబాద్: ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, బీజేపీ నుంచి బొమ్మ శ్రీ రాం చక్రవర్తి పోటీ పడుతున్నారు. గౌడ సామాజికవర్గానికి చెందిన ఓట్లు 35 వేల పైచిలుకు, మున్నూరుకాపు ఓట్లు దాదాపు 30 వేల వరకు ఉన్నాయి. సొంత సామాజికవర్గాలు, ఇతర బీసీ కులాల మద్దతు, జాతీయ పార్టీల ఇమేజ్ తమకు కలిసి వస్తాయని వారు విశ్వసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment