సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎమ్మెల్యేలు, ఆశావహుల సర్వేలు జోరందుకున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల లీడర్లు ఎవరికి వారుగా ఓటరు అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలకు గాను 10 టీఆర్‌ఎస్ గెలుచుకోగా మిగిలిన మూడింటిలో ఏఐఎఫ్‌బీ, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలిచారు. వీరిలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమకు అందుబాటులో ఉన్న వివిధ శాఖల అధికారుల ద్వారా ప్రజల మూడ్ తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా తెలుసుకుంటున్నారు. పాతజిల్లాలో కొన్ని సోషల్‌మీడియా పేజీలు, హాండిళ్లు వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు? అంటూ బహిరంగంగా ఫొటోలు పెట్టి మరీ అభిప్రాయం తెలుసుకోవడం విశేషం.
కరీంనగర్‌లో ఇద్దరు
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకున్నాక, ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యల తర్వాత స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కమలాకర్ గంగుల సర్వే చేయించారు. అత్యంత గోప్యంగా నిర్వహించిన ఈ సర్వేతో బీఆర్‌ఎస్ గ్రాఫ్, 2018 ఎన్నికల కంటే 16 శాతం పెరిగిందని మంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి ఎవరన్నది తేలకపోవడం తమకు అనుకూలిస్తుందని బీఆర్‌ఎస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి.
●మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బహిరంగ సర్వే ప్రారంభించారు. ప్రతీ గ్రామంలోని 100 మంది ఓటర్లను కలిసే బాధ్యతలను బీఆర్‌ఎస్ కార్యకర్తకు అప్పగించారు. వీరంతా పార్టీ మండలాధ్యక్షుడికి, మండలాధ్యక్షులంతా ఎమ్మెల్యేతో టచ్‌లో ఉంటారు. ప్రతీ కుటుంబంలో ఎన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఏదైనా పథకం అందలేదా? ఈసారి ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు? కులం, వృత్తి, ఫోన్‌నెంబర్లు అడిగి నోట్ చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా తాజా ఓటర్లకు సమానమైన పేపర్లు ముద్రించి తీసుకురావడం గమనార్హం. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు, కార్యకర్తల స్థితిగతులను తెలుసుకునేందుకు వివరాల సేకరణ చేపట్టినట్లు ఎమ్మెల్యే రసమయి వెల్లడించారు.
● కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఏకంగా పార్టీ మారుతున్నారని, ఆయన హుస్నాబాద్ లేదా హుజూరాబాద్ నుంచి పోటీచేస్తారని కొన్నిరోజులుగా సోషల్ మీడియా ప్రచారం హోరెత్తింది. దీనిపై స్పందించిన పొన్నం ప్రభాకర్ తాను పార్టీ మార డం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కొందరు కావాలని తనపై కుట్ర పూరితంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.
● పెద్దపల్లిలో ఉన్నవే మూడు అసెంబ్లీ స్థానాలు. అందులో రామగుండం నుంచి ఎమ్మెల్సీ కవిత, పెద్దపల్లి నుంచి ఏకంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం ప్రారంభించారు. అంతేకాదు వీరిద్దరూ ఆయా స్థానాల నుంచి బరిలోకి ఎందుకు దిగుతారో కూడా కారణాలు వివరిస్తుండటం విశేషం. పార్టీ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత పెద్దపల్లి జిల్లా నేతలతో తీసుకున్న ఫొటోలను వీటికి జతచేస్తున్నారు. తద్వారా ఆయా ఎమ్మెల్యే వర్గాల్లో కలవరపాటుకు కారణమవుతోంది.
● సిరిసిల్లలో నేతల మధ్య ఎలాంటి వార్ లేదు. వేములవాడలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, అదే పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న చలిమెడ లక్ష్మీనరసింహారావు ఎవరికివారు సర్వేలు చేయించుకుంటున్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య సోషల్‌వార్ వాడీవేడిగా నడుస్తోంది. జగిత్యాలలో ఎమ్మెల్యేల రహస్య సర్వే కొనసాగుతుండగా.. జిల్లాలో సోషల్ మీడియా వార్ అంతగా కనిపించడం లేదు.
నేతలకు ‘సోషల్’ బెంగ
ఉమ్మడి జిల్లాలో సోషల్ మీడియా ప్రచారం ఎమ్మెల్యే అభ్యర్థులను కలవరపరుస్తోంది. ఫలానా స్థానం నుంచి ఫలానా సీనియర్ నేత పోటీ చేస్తారని ఊదరగొడుతున్నారు. ఇంకొందరు నేతల వీ రాభిమానులు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవ రు? అంటూ ఫ్యాన్‌మేడ్ సర్వేల పేరిట ప్రధాన ప్రత్యర్థులు, ఎమ్మెల్యే ఆశావహుల ఫొటోలు పెట్టి ఓటింగ్‌కు వెళ్తున్నారు. ఇది అన్ని పార్టీల అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment