సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఆకాశంలో సగం.. అవనిలో సగం.. అని మహిళల గురించి చెప్పే మాటలు బాగానే ఉన్నా.. ఆచరణలోకి వచ్చే సరికి ఎవరూ పాటించడం లేదు. రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉన్నా.. అవకాశాలు లేక మహిళలు అట్టడుగునే ఉంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో చూసుకుంటే.. మొత్తం ఓటర్లలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఆ మేరకు రాజకీయంగా మాత్రం వారికి ప్రధాన రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వలేదు. శాసనకర్తలు మహిళలు ఉంటే ఆ వర్గానికి మరింత న్యాయం జరుగుతుందనేది అందరూ ఏకీభవించాల్సిన వాస్తవం. మహిళలు అంతరిక్షంలో అడుగుపెడుతున్న ప్రస్తుత ఆధునిక యుగంలో రాజకీయాల్లో మాత్రం వారికి అంతగా ప్రాధాన్యం లభించడం లేదనే చెప్పవచ్చు.
ఇందుకు ప్రస్తుత శాసనసభ ఎన్నికలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ప్రధానపార్టీల నుంచి 36 మంది బరిలో నిలిస్తే అందులో మహిళలు కేవలం ఐదుగురు మాత్రమే ఉండడం ఆయా పార్టీల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇందులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళలకు అసలే ప్రాధాన్యం దక్కకపోగా, బీజేపీ నుంచి రామగుండం, సిరిసిల్ల, చొప్పదండి, జగిత్యాల సీట్లు అతివలకు కేటాయించారు. పెద్దపల్లి నుంచి బీఎస్పీ మహిళను బరిలో నిలపింది. బీజేపీ నాలుగు స్థానాలు కేటాయించి అగ్రస్థానంలో నిలిచింది. మహిళలు సైతం స్వతంత్రంగానైనా బరిలో నిలిచే సాహసం చేయకపోవడం సమాజంలో మహిళలంటే వివక్ష దూరం కాలేదన్న వాదనకు తెరలేపుతోంది.
అన్ని జిల్లాల్లో ఎక్కువే..
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములు మహిళలే శాసించనున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. రాజకీయ పార్టీలు మహిళల జనాభా, ఓటర్లకు అనుగుణంగా రాజకీయ అవకాశాలు కల్పించడం లేదన్న అసంతృప్తి ఉంది. 50 శాతం రిజర్వేషన్ల పుణ్యమాని స్థానిక సంస్థల్లో సగానికిపైగా ప్రజాప్రతినిధులు మహిళలకు అవకాశం దక్కుతోంది. కానీ.. అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం మహిళలకు ప్రాధాన్యం దక్కడం లేదు. రాజకీయ పార్టీలు.. వారికి పోటీ చేసేందుకు ఇస్తున్న సీట్లు, అందులో వారు గెలిచే స్థానాలు.. పురుషులతో పోల్చితే చాలా తక్కువగా ఉంటున్నాయనే విమర్శ ఉంది.
దేశంలో ఇలా..
1998–2023 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 21,161 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా.. వారిలో మహిళల సంఖ్య 1,584 మాత్రమే. ఏపీ, తెలంగాణ సహా దేశంలో 19 రాష్ట్రాల్లో మహిళా శాసనసభ్యులు 10 శాతానికి మించి లేరు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 1,821 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. అందులో బరిలో నిలిచిన మహిళల సంఖ్య 140 మాత్రమే. కానీ.. అందులో గెలిచిన మహిళల సంఖ్య కేవలం ఆరుమాత్రమే.
రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో...
2018 ఎన్నికల్లో తెలంగాణలో ఖానాపూర్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి అజ్మీరా రేఖానాయక్, మెదక్ నుంచి పద్మాదేవేందర్ రెడ్డి, మహేశ్వరం నుంచి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, ఆలేరు నుంచి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, ములుగు నుంచి సీతక్క, ఇల్లందు నుంచి బానోతు హరిప్రియ ఎన్నికయ్యారు. ఈ లెక్కన 119 నియోజకవర్గాల్లో ఎన్నికైన మహిళా శాసనసభ్యుల సంఖ్య కేవలం ఐదు శాతం మాత్రమే.
33 శాతం రిజర్వేషన్ అమలైతే..
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందింది. అది చట్టంగా మార్చితే మహిళలకు ఆ మేరకు సీట్లు కేటాయించడం తప్పనిసరి. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2027 తర్వాతే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకు వస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. చట్టం అమల్లోకి వస్తే 12 నియోజకవర్గాలకు గాను ప్రతీ పార్టీ సుమారు నాలుగేసి స్థానాలు విధిగా కేటాయించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment