మోదీది సవతి తల్లి ప్రేమ | CM Revanth Reddy Sensational Comments On PM Narendra Modi | Sakshi
Sakshi News home page

మోదీది సవతి తల్లి ప్రేమ

Published Sat, May 4 2024 12:53 AM | Last Updated on Sat, May 4 2024 12:57 AM

CM Revanth Reddy Sensational Comments On PM Narendra Modi

పదేళ్లలో రాష్ట్రానికి గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలే..: సీఎం రేవంత్‌రెడ్డి

మోదీ చెప్పే 5 ట్రిలియన్‌ ఎకానమీ ఆద్యుడు మన పీవీనే 

బీఆర్‌ఎస్‌ కాలనాగు.. దానిని పడగ మీద కొట్టాలి 

రాజారాంపల్లి, సిరిసిల్ల బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌/సిరిసిల్ల: ప్రధాని మోదీ తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నాడని, పదేళ్లలో ఆయన రాష్ట్రానికి చేసిందేమీ లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మోదీ తరచుగా చెప్పే ఐదు ట్రిలియన్ల ఎకానమీకి ఆద్యుడు ఒకప్పటి మంథని నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని గుర్తుచేశారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కాలనాగు అని దాన్ని ఈసారి ఎన్నికల్లో తలమీదే కొట్టాలని పిలుపునిచ్చారు. జనజాతర సభలో భాగంగా శుక్రవారం «జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని రాజారాంపల్లి, సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగసభ, కార్నర్‌ మీటింగ్‌లో సీఎం రేవంత్‌ మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై నిప్పులు చెరిగారు.  

సీఎం రేవంత్‌ ఏమన్నారంటే.... 
నేను మధ్యాహ్నం రెండు గంటలకే రావాల్సి ఉన్నా.. రాయ్‌బరేలిలో రాహుల్‌గాంధీ నామినేషన్‌ కార్యక్రమానికి హాజరుకావడం, విమానంలో సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. బీఆర్‌ఎస్‌ చచ్చిన పాము. తోక మీద కాదు.. పడగ మీద కొట్టండి. కాలనాగు పీడ విరగడవుతుంది. ఇక బీజేపీ నోరు తెరిస్తే.. అబద్ధాలే. ఎన్టీపీసీలో 4,000 మెగావాట్లకుగాను పదేళ్లలో 1,600 మెగావాట్ల ప్లాంట్‌ మాత్రమే నిర్మించారు.

దేశంలో రాజ్యాంగం, రిజర్వేషన్లు ఉండాలంటే రాహుల్‌గాంధీ ప్రధాని కావాలి. గాంధీ కుటుంబానికి తోడుగా నిలబడాలి. మా ప్రభుత్వం జోలికొస్తే కార్యకర్తలు ఊరుకోరు’’అని ముగించారు. అనంతరం బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, గిరిజన వర్సిటీ, ఐఐటీ, ఐఐఎం ఇలా ఏది అడిగినా.. బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని సభికులతో సీఎం రేవంత్‌ అనిపించారు. 

కారు ఢిల్లీకి పోతే.. కమలం అవుతుంది  
‘తెలంగాణలో కారు ఢిల్లీకి పోతే కమలం అవుతుంది. 2014, 2019లో రెండుసార్లు 12 ఎంపీ సీట్లు, 9 ఎంపీ సీట్లు ఇస్తే.. కేసీఆర్‌ ఏం చేశాడు..ఢిల్లీ సుల్తాన్‌లకు తాకట్టుపెట్టాడు’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెచి్చన నల్లాచట్టాలు, నోట్ల రద్దుకు బీఆర్‌ఎస్‌ మద్దతు పలికిందన్నారు. కరీంనగర్‌లో పోటీచేసిన ఒక్కరు అపరమేధావి, మరొకరు అరగుండు మేధావి అని, ఇద్దరూ పాతవారే, ఎంపీలుగా పనిచేసిన వారే కదా అని ప్రశ్నించారు.

ఎంపీలుగా ఉన్నప్పుడు ఏమీ చేయనోళ్లు.. ఇప్పుడు మళ్లీ గెలిచి ఏం చేస్తారన్నారు. పదేళ్లు తెలంగాణను నిర్లక్ష్యం చేసి, తెలంగాణ పునరి్వభజన చట్టాన్ని అమలు చేయని బీజేపీకి ఓట్లు ఎట్లా వేస్తామన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, వరంగల్‌ రైల్వే కోచ్‌ ప్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్‌ కారిడార్‌ వంటి తెలంగాణ పునరి్వభజన చట్టంలోని ఒక్కదాన్ని కూడా బీజేపీ ఇవ్వలేదని చెప్పారు.  

ఉద్దెరోడు పెట్టిన రూ.40 వేల కోట్లు కట్టలేక పోతున్నా.. 
రాష్ట్రంలో ఈ ఉద్దెరోడు పెట్టిపోయిన రూ.40వేల కోట్లు కట్టలేక పోతున్నానని, సిరిసిల్ల నేతన్నలకు రూ.275 కోట్లు బకాయి పెట్టిపోయిండని రేవంత్‌రెడ్డి అన్నారు. నేత, గీత కార్మికులను ఆదుకోవాలని నేతకార్మికులకు ఇటీవల రూ.50కోట్లు మంజూరు చేశామని, ఎన్నికల ముగిసిన తర్వాత మిగతా బకాయిలు ఇస్తామన్నారు. 

అధికారంలోకి వచి్చన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేశామని, 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్, చొప్పదండి, మానకొండూర్‌ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement