
ఆశలు ఆవిరి
సిరిసిల్ల పట్టణంలో విలీనమైన గ్రామాలకు మినహాయింపునిస్తూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. ఏడు గ్రామాలు మున్సిపల్ నుంచి విడి పోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి మళ్లీ గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు గతంలో స్పష్టం చేశారు.
సిరిసిల్ల పట్టణంలో బలవంతంగా విలీనం చేసిన రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, చిన్నబోనాల, పెద్ద బోనాల, పెద్దూరు, సర్దాపూర్ గ్రామాలను మున్సిపల్ నుంచి వేరు చేసి గ్రామపంచాయతీలుగా ఉంచేలా కృషి చేస్తానని, ఏడు గ్రామాల ప్రజల ముంగిట ప్రమాణం చేస్తూ 2023 నవంబరు 28న కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి బాండ్ పేపర్ రాసిచ్చారు.
సిరిసిల్ల: సిరిసిల్లలో విలీనమైన ఏడు గ్రామాలు, వేములవాడ పరిధిలో ఐదు గ్రామాలను పట్టణాల నుంచి విడదీసి మళ్లీ గ్రామపంచాయతీలను చేయాలనే ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు. మరోవైపు ప్రభుత్వం వద్ద ఉన్న విభజన ఫైల్‌ను పక్కన పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మున్సిపాలిటీల నుంచి గ్రామాలను విడదీయాల్సి ఉండగా గ్రామాల విభజనను పక్కన పెట్టినట్లు సమాచారం. మరో వైపు ముందుగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో శివారు పల్లెల ఆశలు ఆవిరయ్యాయి.
ఎందుకు విలీనమయ్యాయి
సిరిసిల్ల 2016 అక్టోబరులో జిల్లా కేంద్రమైంది. కానీ జనాభా 83వేల వరకు ఉంది. లక్ష జనాభా ఉంటే ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీల జాబితాలో చేరుతుంది. ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా భారీగా నిధులు సమకూరుతాయి. పట్టణ వైశాల్యం, మున్సిపల్ వార్డులు పెరుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో 2018లో సిరిసిల్ల శివారులోని ఏడు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు.
కోర్టుకెక్కిన పల్లెలు
సిరిసిల్లలో విలీనమైన ఏడు గ్రామాల తరుఫున పెద్దూరు, సర్దాపూర్ వాసులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో ఆయా గ్రామాల ప్రజలు విలీనాన్ని వ్యతిరేకించారు. శ్రీపల్లెలను చంపేస్తారా.. పట్టణీకరణ పేరిట పంచాయతీలను పట్టణాల్లో కలిపేస్తారాశ్రీ అంటూ న్యాయస్థానం విలీన పల్లెల పిటిషన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కానీ, చివరికి ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ విలీనం జరిగిపోయింది. పదేళ్ల వరకు ఎలాంటి ఆస్తి పన్నులు ఆ పల్లెల్లో పెంచమని, వేగంగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికలతో పాటు ఆ పల్లెల్లో వార్డు కౌన్సిలర్ ఎన్నికలు జరిగాయి.
మున్సిపాల్టీల్లోనే శివారు పల్లెలు గతంలో సిరిసిల్లలో ఏడు, వేములవాడలో ఐదు గ్రామాలు విలీనం విభజన ఫైల్ పక్కన పెట్టిన ప్రభుత్వం
అభివృద్ధి అంతంతే
సిరిసిల్లలో విలీనమైన ఏడు గ్రామాల్లో ఐదేళ్లలో అభివృద్ధి పనులు అంతంతే జరిగాయి. పంచాయతీ రికార్డులన్నీ మున్సిపల్‌కు అప్పగించారు. సిబ్బందిని సైతం మున్సిపల్‌లో కలిపేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసే ఉపాధి వంటి పథకాలు ఆ గ్రామాలకు దూరమయ్యాయి. ఆస్తి తదితర పన్నులు భారీగా పెరిగాయి. ఫలితంగా పట్టణాల్లో చిక్కిన పల్లెలు అభివృద్ధి లేక, పన్నుల భారంతో విలవిల్లాడుతున్నాయి. మున్సిపల్ నుంచి విడదీసి ఏడు గ్రామాలతో సిరిసిల్ల అర్బన్ మండలం ఏర్పాటు చేయాలనే ఆందోళనకు దిగారు. మొత్తంగా విలీన పల్లెల్లో ఒకరకమైన వ్యతిరేకభావం నెలకొంది. వేములవాడ పట్టణంలోనూ తిప్పాపూర్, అయ్యోరుపల్లె, కోనాయపల్లె, శాత్రాజుపల్లె, నాంపల్లి గ్రామాలను బలవంతంగా విలీనం చేశారు. ఆ ఊర్లు కూడా గ్రామాలుగా ఉండాలని కోరుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే విలీన గ్రామాలను వేరు చేసి ఎన్నికలు నిర్వహిస్తారనే ఆశ ఉండేది. కానీ విభజన ఊసే లేకుండా ఎన్నికలకు ఏర్పాట్లు జరగడంతో విలీనమైన పల్లెలకు ఇప్పట్లో మోక్షం లేకుండాపోయింది.

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి
Comments
Please login to add a commentAdd a comment