
ఆందోళన వద్దు
యూరియా కోసం
● సీజన్‌కు సరిపడా నిల్వలు ఉన్నాయి ● కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ● ‘సాక్షి’తో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం
సిరిసిల్ల: జిల్లాలో యాసంగి సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం అన్నారు. జిల్లావ్యాప్తంగా 13 మండలాల పరిధిలో లక్షా 80వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారని, ఈ సీజన్‌కు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని వివరించారు. ఎవరైనా ఎక్కడైనా యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో అక్కడక్కడ యూరియా కొరత ఉన్నట్లు ప్రచారం జరగుతుండగా.. మంగళవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు.
సహకార సంఘాల ద్వారా సరఫరా
జిల్లా వ్యాప్తంగా 24 వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా.. వాటి ద్వారా క్షేత్రస్థాయిలో యూరియా సరఫరా చేస్తున్నాం. ఇప్పటికే 1,300 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చింది. మార్క్‌ఫెడ్ అధికారులతో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడి మరో 400 మెట్రిక్ టన్నుల యూరియా తెప్పించారు. సీజన్ మొత్తానికి 1,800 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటికే 1,700 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చింది.
వరి సాగే ఎక్కువ
జిల్లాలో లక్షా 80వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. అందులో ఒక్క వరి పంటనే లక్షా 77వేల ఎకరాల్లో వేశారు. మొక్కజొన్న 1,400 ఎకరాలు, కూరగాయల సాగు 1,500 ఎకరాల్లో ఉంది. మరో వంద ఎకరాల్లో అన్ని పంటలు కలిపి వేశారు. ఈ యాసంగి సీజన్‌కు 1,800 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేశాం. ఈ మేరకు బఫర్ నిల్వలు అందుబాటులో ఉంచాం.
ఆన్‌లైన్‌లో రైతుల వివరాలు
యూరియా సరఫరాకు సంబంధించి ఆన్‌లైన్‌లో రైతుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంటే.. ఎకరానికి రెండు బస్తాల చొప్పున యూరియా అందిస్తున్నాం. ఇలా వివరాలు నమోదు చేసి రైతు వేలి ముద్రను తీసుకుని ఇవ్వడంతో కొంత ఆలస్యమవుతుంది. సహకార సంఘాల్లో ఎక్కువ మంది సిబ్బంది లేక.. యూరియా వచ్చిందని తెలియగానే రైతులు ఒక్కసారిగా ఎక్కువ సంఖ్యలో రావడంతో క్యూ పద్ధతిలో వివరాలు నమోదు చేసి అందరికీ ఇస్తున్నారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో యూరియా కోసం క్యూ లైన్ ఉంటున్నట్లు ప్రచారం జరుగుతుందే తప్ప కొరత ఏమీ లేదు.
రెండు దఫాలుగా వేయాలి
రైతులు ఒకేసారి కాకుండా రెండు దఫాలుగా పంటకు యూరియా వేయాలి. ఎకరానికి రెండు బస్తాలు సరిపోతాయి. కానీ కొందరు మూడు బస్తాలు వేస్తున్నారు. ఇది తప్పు. రెండు విడతల్లో రెండు బస్తాలు వేస్తే సరిపోతుంది. కొందరు రెండు బస్తాలు వేసి ఆదర్శంగా ఉంటున్నారు.
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
యూరియా, పొటాష్‌ను ఎవరైనా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్యాక్స్‌లతో పాటు, ప్రైవేటు డీలర్ల వద్ద ఎరువుల నిల్వలు ఉన్నాయి. వచ్చే సీజన్ కోసం ఎరువులు కొనకుండా.. రైతులు ఈ సీజన్ కోసం మాత్రమే కొనుగోలు చేయాలి. జిల్లాలో రైతుల అవసరాల మేరకు ఎరువులను అందుబాటులో ఉంచుతాం.

ఆందోళన వద్దు
Comments
Please login to add a commentAdd a comment