
కలిసొస్తే పోటీకి సై
● రిజర్వేషన్ల వైపు నేతల చూపు ● ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ఏది ముందోనని చర్చ ● రెండు ఎన్నికలకు అధికారుల ఏర్పాట్లు ● ఇప్పటికే ఓటర్ల జాబితా వెల్లడి
సిరిసిల్ల: పల్లెల్లోని నేతలు ఎన్నికలపై దృష్టి సారించారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీల సభ్యుల ఎన్నికల్లో ఏది ముందు వచ్చినా బరిలో దిగేందుకు కసరత్తు మొదలుపెట్టారు. రిజర్వేషన్లు కలిసొస్తే ఎలాగైనా గెలవాల్సిందేనని పట్టుదలతో జన, అర్థబలాలు సమీకరించుకుంటున్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడాది కావస్తుండగా, ఎంపీటీసీలు, జెడ్పీటీల పదవీకాలం ముగిసి ఆరు నెలలు దాటింది. ఇన్నాళ్లు ఏ పదవీ లేకుండా గ్రామాల్లో ఉంటున్న నాయకులు ఎలాగైనా బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనగణన చేపట్టడంతో బీసీల రిజర్వేషన్లు పెరుగుతాయనే ప్రచారం జోరందుకుంది. దీంతో బీసీ నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో రిజర్వేషన్లపై చర్చసాగుతోంది.
అసలు ఏ ఎన్నికలు ముందు
గ్రామ సర్పంచ్ ఎన్నికలు ముగిసి ఎక్కువ కాలం కావడం, పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికలను ముందుగా నిర్వహించాలని నిర్ణయించి పోలింగ్ కేంద్రాల ఎంపిక, వార్డుల విభజన, ఓటర్ల జాబితా వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేసి నోటిఫికేషన్ జారీయే తరువాయి అన్నట్లుగా రంగం సిద్ధమైంది. కానీ ముందుగా మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. పదోతరగతి, ఇంటర్ పరీక్షలు ముంచుకొస్తున్నాయి. ఇలాంటి తరుణంలో స్థానికసంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ఇంకా నిర్ధారణ కాలేదు. జిల్లా అధికారులు మాత్రం సవరించిన ఓటర్ల జాబితా వెల్లడించారు.
కొత్త రిజర్వేషన్ల.. పాతవేనా?
2019లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్లను కొనసాగిస్తారా? మళ్లీ మార్పులు, చేర్పులు చేస్తారా? అనే చర్చ సాగుతోంది. బీసీ కులగణన నేపథ్యంలో రిజర్వేషన్లు ఏమైనా పెరుగుతాయా? అనే సందేహాలు నెలకొన్నాయి. పార్టీ సహితంగా జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తాచాటాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు చూస్తున్నాయి.
స్థానిక సంస్థల స్వరూపం
గ్రామాలు 260
వార్డులు 2,268
మండలాలు 12
జెడ్పీటీసీలు 12
ఎంపీపీలు 12
ఎంపీటీసీలు 123
మండలాల వారీగా ఓటర్లు
మండలం పురుషులు మహిళలు థర్డ్ జెండర్ మొత్తం
బోయినపల్లి 15,001 16,019 – 31,020
చందుర్తి 13,444 14,651 – 28,095
ఇల్లంతకుంట 19,775 20,977 – 40,752
గంభీరావుపేట 17,889 19,061 01 36,951
కోనరావుపేట 17,174 18,057 – 35,231
ముస్తాబాద్ 18,833 19,984 – 38,817
రుద్రంగి 6,435 7,176 03 13,614
తంగళ్లపల్లి 18,809 19,891 – 38,700
వీర్నపల్లి 5,911 6,063 – 11,974
వేమువాడఅర్బన్ 9,099 9,623 16 18,738
వేములవాడరూరల్ 9,119 9,918 – 19,017
ఎల్లారెడ్డిపేట 19,705 21,182 – 40,887
మొత్తం 1,71,174 1,82,602 20 3,53,796
Comments
Please login to add a commentAdd a comment