
పులి భయం వీడెదెప్పుడో!
● గుట్టల్లో అధికారుల జల్లెడ ● కనిపించని జాడ ● భయాందోళనలో గ్రామస్తులు
వేములవాడరూరల్: పులి సంచరిస్తుందన్న ఫారెస్ట్ అధికారుల మాటలు అటవీ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అటవీని ఆనుకుని ఉన్న పొలాల వద్దకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. గత పది రోజులుగా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి ఫారెస్ట్ ఏరియాలో పులి తిరుగుతోందని అధికారులు పాదముద్రలు సేకరించే పనిలో పడ్డారు. అయితే ఇప్పటి వరకు పులి జాడ తెలియకపోవడం.. ఎటు వైపు వెళ్లిందో తెలియక అటవీ సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కనిపించని ఆనవాళ్లు.. అయినా వీడని భయం
వేములవాడ నియోజకవర్గంలోని నూకలమర్రి, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, వేములవాడ మండలాల్లో ఎక్కువ అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల్లో పులి సంచరిస్తుందని అధికారులు చెప్పడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పులి తిరుగుతున్నట్లు చెప్పడంతో గ్రామీణులు ఉపాధిహామీ, వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. పులి రోజుకు కనీసం 30 నుంచి40 కిలోమీటర్లు సంచరిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే దాని ఆచూకీ దొరక్కపోవడంపై భయాందోళనలు మొదలయ్యాయి.
పర్యవేక్షిస్తున్నాం
వేములవాడ నియోజకవర్గంలో పులి సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో అడవిలో నిత్యం సిబ్బందితో పర్యవేక్షిస్తున్నాం. పులి రోజుకు 25 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీంతో వేములవాడ నియోజకవర్గంలో ఫారెస్టు ప్రాంతం తక్కువగా ఉండడం, నీరు లేకపోవడం, జంతువులు లభించకపోవడంతో పులి మరో ప్రాంతానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
– ఖలీలొద్దీన్, ఎఫ్‌ఆర్‌వో, వేములవాడ

పులి భయం వీడెదెప్పుడో!
Comments
Please login to add a commentAdd a comment