భక్తులకు సౌకర్యాలు కల్పించండి
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● వేములవాడలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు పరిశీలన
వేములవాడ: గత మహాశివరాత్రి జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, ఈఈ రాజేశ్ తదితరులతో కలిసి గురువారం ఆలయంతోపాటు పరిసరాలు, పార్కింగ్ స్థలం, క్యూలైన్లు, ధర్మగుండం, కల్యాణకట్ట, భక్తులు విడిది చేసే ప్రాంతాల్లో కలియతిరిగారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈసారి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున, వాహనాల పార్కింగ్ స్థలాల సంఖ్య పెంచాలని చెప్పారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ డ్రైవర్షన్ల వద్ద సూచిక బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన ఆలయం, అనుబంధ దేవాలయాలు, పార్కింగ్ ప్రదేశాలు, శివార్చన స్థలం, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు బిగించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, ఆలయ డీఈ మహిపాల్‌రెడ్డి, ఏఈవో శ్రవణ్‌కుమార్, ఏఈ రాంకిషన్‌రావు, ఎస్సైలు ప్రేమానందం, రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment