సిరిసిల్ల కల్చరల్/కరీంనగర్ స్పోర్ట్స్●:
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేని ఇల్లు లేదు. ప్రతీ కుటుంబంలో నాలుగేసి ఫోన్లు, ఒక్కోదాంట్లో రెండేసి సిమ్‌కార్డులు, వైఫై సౌకర్యంతో పాటు డిజిటల్ స్మార్ట్‌టీవీలు, కంప్యూటర్, ల్యాప్‌టాప్ వంటి ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరిగిపోయింది. ఇదే సమయంలో ఇంట్లో ఉండే పిల్లలు క్రమంగా స్మార్ట్‌ఫోన్లకు బానిసవుతున్నారు. తినేటప్పుడు, హోమ్‌వర్క్ చేసేటప్పుడు ఫోన్ చూడాల్సిందే. బంధువుల ఇళ్లల్లో శుభకార్యాలకు హాజరైన సందర్భాల్లోనూ ఎవరినీ పట్టించుకోకుండా సెల్‌ఫోన్‌తో ఒంటరిగా గడిపే పిల్లలు చాలామంది కనిపిస్తున్నారు. వీడియోలు, రీల్స్ కనిపిస్తే తప్ప అన్నం ముద్ద దిగనంత వ్యసనంగా మారిపోయింది. దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఇదే సమస్య. ఈ అలవాటు ఎలా మాన్పించాలో తెలియక బాధిత తల్లిదండ్రులు తల పట్టుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలు దాదాపు 15.16 లక్షల వరకు ఉండగా వీరిలో సగానికి పైగా ఇలాంటోళ్లే ఉన్నారు.
కోవిడ్ తెచ్చిన సమస్య
కరోనా సమయంలో స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగం పెరిగింది. ఆన్‌లైన్ తరగతులు పేరిట టీచర్లు ఫోన్లలోనే పిల్లలకు పాఠాలు చెప్పారు. ఆ అలవాటును చిన్నారులు కొనసాగిస్తున్నారు. బడి నుంచి ఇంటికి రావడమే ఆలస్యం.. ముందు మొబైల్ ఓపెన్ చే యాల్సిందే. లేకుంటే యుద్ధమే. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్ అకౌంట్లు వాడేస్తున్నారు. స్కూల్లో ఇచ్చే ప్రాజెక్టుల్లో యూట్యూబ్, గూగుల్ నుంచి ఫొటోలు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఉపాధ్యాయులే ప్రోత్సహిస్తున్నారు. ఈ రోజుల్లో పిల్లలకు అన్నం తినిపించడం పెద్ద పరీక్ష. గతంలో చందమామ రావే అంటే చాలు చిన్నారి నోట్లోని ముద్దను గుటుక్కున మింగేసే వాడు. ఇప్పుడా పరిస్థితుల్లేవు. వారికి అన్నం తినిపించాలంటే చరవాణి చూపించాలి. కదిలే ఎమోజీ బొమ్మలే కావాలి. లేదంటే కేకలేస్తారు.
రెండేళ్లలోపువారికి ఫోన్ చూపించొద్దు
అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నివేదిక ప్రకారం.. రెండేళ్లలోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ చూపించకూడదు. రెండు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు కేవలం గంట, ఐదు నుంచి ఎనిమిదేళ్లలోపు పిల్లలకు పెద్దల సమక్షంలో రెండు గంటలపాటు ఫోన్ ఇవ్వొచ్చు. ఆస్ట్రేలియా, లూసియానా, సౌత్ కరోలినా వంటి దేశాల్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సెల్‌ఫోన్లు ఇవ్వడం నిషేధం.
జాగ్రత్తలు తప్పనిసరి
టీవీ, మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ వంటివి ఏవైనా సరే రెండు గంటలు దాటితే ప్రమాదమే.
ప్రతీ 20 నిమిషాలకు 20 సెకన్లు విరామం ఇస్తూ 20 అడుగుల దూరం నుంచి చూడొచ్చు. అదీ విద్యాసంబంధ విషయాలకు మాత్రమే.
ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. రాత్రి పడుకునే ముందు మొబైల్ చూడొద్దు.
రాత్రి 8 గంటల తర్వాత ఇంటిని టెక్ ఫ్రీ జోన్‌గా మార్చేయాలి. అవసరం ఉన్నా సరే మొబైల్ డేటాకు దూరంగా ఉండాలి.
సమస్యలు ఇవీ
అధిక స్క్రీన్ టైమ్ వల్ల తలనొప్పి, మైగ్రేన్, డిజిటల్ ఐ స్ట్రెయిన్, కంటిచూపు మందగిస్తుంది.
పిల్లలు శ్రద్ధగా వినే సామర్థ్యాన్ని కోల్పోతారు. ఫలితంగా చదువుకు దూరమయ్యే
ప్రమాదముంది.
ఎక్కువసేపు కూర్చొని ఉండటం, ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో తెలియక బరువు పెరిగి, ఊబకాయులుగా మారుతారు.
నిద్రలేమి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
చూపుతుంది.
మొబైల్ గేమ్స్‌కు బానిసవుతారు. చిన్న వయసులోనే రక్తపోటు వస్తుంది.
విపరీతమైన ఒత్తిడి, అనవసరమైన పోటీ భావన పెరిగి, మానసికంగా అస్థిరతకు లోనవుతారు.
డిజిటల్ చాటింగ్‌కే ప్రాధాన్యత ఇస్తూ సహజ మానవ సంబంధాలకు దూరమవుతారు.
Comments
Please login to add a commentAdd a comment