
ఇసుక రవాణాపై నిఘా పెట్టాలి
● మాదక ద్రవ్యాలను కట్టడి చేయాలి ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్
సిరిసిల్ల: జిల్లాలో ఇసుక రవాణాపై నిఘా పెట్టాలని ఆర్డీవోలు, తహసీల్దార్లను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. ఇసుక రవాణాపై కలెక్టరేట్ నుంచి శనివారం సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో అనుమతి ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి మాత్రమే తరలించాలని, వే బిల్, డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాలకు ఇసుక అవసరం ఉంటుందని తెలిపారు. అక్రమంగా ఇసుక తరలించే వారిపై కేసులు పెట్టాలని, ఆయా చోట్ల ఇసుక అక్రమంగా తరలించకుండా కందకాలు తవ్వించాలని ఆదేశించారు. సిరిసిల్ల ఇన్‌చార్జి ఆర్డీవో రాధాభాయ్, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్లు పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాలను కట్టడి చేయాలి
జిల్లాలో మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మాదకద్రవ్యాలు సరఫరా, వినియోగంపై కఠినంగా ఉందన్నారు. డ్రగ్స్ నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రణాళికాబద్ధంగా నియంత్రించాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించాలన్నారు. అటవీ భూముల్లో గంజాయి సాగు చేస్తే వెంటనే తొలగించాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని సూచించారు. ఎస్పీ అఖిల్ మహజన్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని తెలిపారు. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ భవాని ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment