
రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేయండి
● పలు రోడ్లు పరిశీలించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● పనుల్లో జాప్యం చేయొద్దని సూచన ● అనాథ ఆశ్రమానికి మతిస్థిమితం లేని మహిళ తరలింపు
ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో హైబ్రిడ్ అన్యూటీ మోడల్(హమ్) ద్వారా చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. జిల్లాలోని ముస్తాబాద్–మోహినికుంట, గంభీరావుపేట–కామారెడ్డి, కోళ్లమద్ది, ఎల్లారెడ్డిపేట నుంచి మరిమడ్ల వరకు చేపట్టిన రహదారి పనులను ఆదివారం పరిశీలించారు. వెంకటాపూర్ నుంచి ముస్తాబాద్ మండలం నామాపూర్, ఇల్లంతకుంట నుంచి సిద్దిపేట రహదారి వరకు జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటరమణయ్య, డీఈ శాంతయ్య, ఏఈలు నిఖిల్, నవ్యశ్రీ తదితరులు ఉన్నారు.
అనాథ ఆశ్రమానికి మహిళ తరలింపు
ముస్తాబాద్‌లోని ఓ హోటల్ వద్ద ఉన్న మహిళను గమనించిన కలెక్టర్ తన వాహనాన్ని ఆపి వెంట నే ఆమె వద్దకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానిక నేతలు దీటి నర్సింలు, మెంగని మనోహర్, శీలం స్వామి సదరు మహిళ వివరాలు తెలిపారు. పోతుగల్‌కు చెందిన తల్లీకూతుళ్లు మతిస్థిమితం లేక ముస్తాబాద్‌లో ఉంటున్నారని, ఇటీవల తల్లి మృతిచెందగా, కూతురు ఒంటరిగా మిగిలిందని తెలిపారు. వెంటనే జిల్లా సంక్షేమాధికారికి ఫోన్ చేసి సదరు మహిళకు జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించి, ఆశ్రమానికి తరలించాలని ఆదేశించారు. వెంటనే చేరుకున్న సంక్షేమాధికారులు ఆమెకు చికిత్స అందించి, బద్దెనపల్లి ఆశ్రమానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment