
ఆర్టీసీ బస్సు.. కండీషన్ తుస్సు !
● బ్రేక్‌డౌన్ అవుతున్న బస్సులు ● కాలంచెల్లిన వాహనాలతో పరేషాన్ ● బస్సుల నిర్వహణపై ప్రయాణికుల కస్సు ● డొక్కు బస్సులను తొలగించాలని డిమాండ్ ● స్క్రాప్‌కు వచ్చిన బస్సుల నిర్వహణపై ఆగ్రహం
సిరిసిల్లటౌన్: ఆర్టీసీ బస్సు అదుపుతప్పుతోంది. కండీషన్ లేక కిర్రుమంటున్నాయి. కాలం చెల్లిన బస్సులు మార్గమధ్యలోనే మొరాయిస్తున్నాయి. పాతటైర్లు.. గలగల శబ్దాలు వచ్చే కిటికి అద్దాలు.. బ్రేక్ వేస్తే కిర్రుమంటూ కఠోరశబ్దాలు చేస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల జిల్లాలో వరుసగా టైర్లు పేలి బస్సులు అదుపుతప్పిన ఘటనలు మరింత భయపెడుతున్నాయి. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ డిపోల్లోని బస్సుల కండీషన్‌పై ఫోకస్ కథనం.
పగులుతున్న టైర్లు
● కామారెడ్డి నుంచి కరీంనగర్‌కు వస్తున్న ఆర్టీసీ ఆర్డినరీ బస్సు జనవరి 31న మాచారెడ్డి సమీపంలో టైరు పగలడంతో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
● జనవరి 24న సిరిసిల్ల నుంచి ముస్తాబాద్‌కు 70 మంది ప్రయాణికులతో ఆర్డినరీ బస్సు బయలుదేరింది. తుర్కపల్లి సమీపంలోకి చేరుకోగానే టైర్ పగిలింది. బస్సు డ్రైవర్ చాకచక్యంతో బస్సును రోడ్డు పక్కన నిలిపాడు.
● ఈనెల 10న కామారెడ్డి నుంచి సిరిసిల్లకు వెళ్తున్న ఆర్డినరీ బస్సు ఎల్లారెడ్డిపేట శివారులోనే వెనుకటైర్ పేలడంతో బస్సు అదుపుతప్పింది. డ్రైవర్ చాకచక్యంతో కంట్రోల్ చేసి రోడ్డు పక్కనే నిలిపివేశాడు.
రెండు డిపోలు.. 132 బస్సులు
● సిరిసిల్ల డిపోలో 67, వేములవాడలో 65 మొ త్తంగా 132 బస్సులు ఉన్నాయి. ఇందులో ఎక్స్‌ప్రెస్‌లు 53, డీలక్సులు 21, సూపర్‌లగ్జరీలు 2, పల్లెవెలుగులు 56 బస్సులు ఉన్నాయి. వీటిలో హైర్‌పర్చేస్ బస్సులు 70 ఉన్నాయి. నిత్యం సిరి సిల్ల, వేములవాడ డిపోల పరిధిలోని సుమారు 1100 ట్రిపుల్లో దాదాపు 56వేల కిలోమీటర్ల మేర నడుస్తాయి. నిత్యం జిల్లా వ్యాప్తంగా రెండు డిపోల బస్సుల్లో సుమారు లక్ష మంది ప్రయాణిస్తున్నారు.
పర్యవేక్షణ లేక పరేషాన్
● ఆర్టీసీ డిపోల్లో బస్సుల కండీషన్‌పై పర్యవేక్షణ కరువైంది. నిత్యం మెకానిక్‌లు షిఫ్టుల ప్రకారం బస్సులను మరమ్మతులు చేస్తుంటారు. షెడ్యూల్ 1, 2, 3, 4 ప్రకారం బస్సులను అన్ని విభాగాలను పర్యవేక్షిస్తుంటారు. ఆర్టీసీలో అన్ని బస్సులు ఎయిర్‌బ్రేక్ సిస్టమ్‌తో నడుస్తాయి. షెడ్యూల్–1లో ఎయిర్ ఇంప్రెషన్‌పై ఎక్కువగా పరిశీలిస్తారు. జాయింట్ రాడ్, టైర్లు, క్రాసులు తదితరాలను మెకానిక్‌లు పరిశీలిస్తారు. షెడ్యూల్–2లో ఏ టు జెడ్ వరకు పరిశీలిస్తారు. జాయింట్లు, టైర్లు, పులెయన్ పుష్ రాడ్లు ఇలా ముఖ్యమైన భాగాలను పరిశీలించాల్సి ఉంటుంది. షెడ్యూల్ 3, 4 ద్వారా రబ్బర్ ఐటమ్స్ మార్పులు, ఎస్టీ నట్లు మార్చడం, 15వేల కిలోమీటర్లు తిరిగిన ప్రతీ బస్సు ఇంజిన్, గేర్‌బాక్సులు, స్టీరింగ్, నట్లు బోల్టులు చెక్ చేస్తారు. ఇవన్నీ కాకుండా ప్రతీ రెండు రోజులకోసారి డ్రైవర్లు చెప్పిన వివిధ రిపేర్లతోపాటు సాధారణ సాంకేతిక సమస్యలను చెక్ చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ కండీషన్, బస్సుల బాడీ కండీషన్లు చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇరు డిపోల్లోని అధికారులు బస్సుల కండీషన్‌పై శ్రద్ధ చూపడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
నిర్వహణ లోపం
● సిరిసిల్ల, వేములవాడ డిపోల్లో 60 మంది గ్యారే జ్ మెకానిక్‌లు పనిచేస్తున్నారు. నిత్యం మెకా నిక్‌ల పర్యవేక్షణ తర్వాతే బస్సులు రోడ్డెక్కాలి. కానీ రెగ్యులర్‌గా మెకానిక్‌లు పరిశీలించడం లే దని తెలిసింది. వీరిపై అధికారుల పర్యవేక్షణ లే క పరిస్థితి ఇలా ఉందని సమాచారం. జిల్లా ప్ర జలకు ప్రధాన రవాణా సౌకర్యమైన బస్సుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, బస్సులను కండీషన్‌లో నిర్వహించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
బస్సులు కండీషన్‌లోనే ఉన్నాయి
బస్సులను కండీషన్ చెక్ చేశాకే రోడ్డుపైకి పంపిస్తున్నాం. బాడీ కండీషన్ సరిగ్గా లేని వాటిని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తున్నాం. బస్సులో సమస్యలపై ప్రయాణికులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. రెండు డిపోలకు కొత్తగా 25 బస్సులు కావాలని ఉన్నతాధికారులు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే వాటిని వినియోగంలోకి తెస్తాం.
– ప్రకాశ్‌రావు, శ్రీనివాస్,
సిరిసిల్ల, వేములవాడ డీఎంలు
మొరాయించిన ఆర్టీసీ బస్సు
నడిరోడ్డుపై ప్రయాణికుల పాట్లు కాలినడకన అల్మాస్‌పూర్‌కు చేరుకున్న ప్రయాణికులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని అల్మాస్‌పూర్ సమీపంలో సోమవారం ఆర్టీసీ బస్సు మొరాయించింది. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని అటవీ గ్రామాల ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు అల్మాస్‌పూర్ మల్లికార్జునస్వామి ఆలయం వద్ద ఆగిపోయింది. ఈ బస్సులో 110 మంది ప్రయాణిస్తున్నారు. ఓవర్‌లోడ్‌తోనే కదలడం లేదని డ్రైవర్ గుర్తించాడు. చేసేదేమి లేక ప్రయాణికులు అల్మాస్‌పూర్ వరకు కాలినడకన వచ్చి ఆటోల్లో మండల కేంద్రానికి చేరుకున్నారు. ఆర్టీసీ అధికారులు మారుమూల గ్రామాలకు, రోడ్లపై కండీషన్‌లో ఉన్న బస్సులు నడిపించాలని కోరుతున్నారు.
ప్రయాణికుల అవస్థలు ఇలా..
చాలా బస్సులను రెగ్యులర్‌గా శుభ్రం చేయడం లేదు. ఫలితంగా బస్సుల్లోని సీట్ల మధ్య దుమ్ము లేస్తుంది. దుర్వాసన కూడా వస్తుంది.
డీలక్స్, సూపర్‌లగ్జరీ బస్సులే కాకుండా ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లోనూ సీట్లు విరిగిపోయి ఉన్నాయి.
చాలా బస్సుల అద్దాలు సరిగ్గా పనిచేయడం లేదు. రబ్బర్ బీడింగ్‌లు లేకపోవడం, మరికొన్ని బస్సుల్లో కిటికీకి సరిపోయేలా అద్దం లేకుండా ఉంటున్నాయి. ఇలా సగం.. సగం అద్దాలతో చలికాలం చలిగాలి, ఎండాకాలం వడగాలులతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ బస్సుల్లో అద్దాలు సరిగా లేక ప్రయాణికులు ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ..చలికి గజగజ వణుకుతూ ప్రయాణాలు చేయాల్సి వస్తోంది.
ప్రతీ టిక్కెటుకు నిర్ణీత సర్‌చార్జీలు, నిర్వహణ చార్జీలు వసూళ్లు చేస్తున్నా సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ఆర్టీసీ బస్సు.. కండీషన్ తుస్సు !

ఆర్టీసీ బస్సు.. కండీషన్ తుస్సు !
Comments
Please login to add a commentAdd a comment