
అర్జీలు పరిష్కరించండి
● ప్రజావాణిలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● వివిధ సమస్యలపై 116 దరఖాస్తులు
సిరిసిల్లటౌన్: ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చే అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రాలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు. వివిధ సమస్యలపై 116 దరఖాస్తులు వచ్చాయి. వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, డీఆర్డీవో శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి జాతరలో చలివేంద్రం ఏర్పాటు చేసి, సామాజిక సేవ చేసే అవకాశం కల్పించాలని థర్డ్‌జెండర్స్ కోరగా.. వారితో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన పెట్రోల్‌బంక్‌లో ఎందుకు ఉపాధి వినియోగించుకోవడం లేదని అడిగారు. అయితే తమకు అక్కడ వసతులు లేవని వారు పేర్కొన్నారు. వసతులు సంక్షేమాధికారి కల్పిస్తారని ప్రభుత్వం కల్పించే ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మండలాల్లో కందుల కొనుగోలు కేంద్రాలు
సిరిసిల్ల: జిల్లాలోని మండలాల్లో కందుల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం కందుల కొనుగోళ్లపై సమీక్షించారు. ఈనెల 22 నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. జిల్లాలో 1,129 ఎకరాల్లో కందిపంట సాగుచేశారని, 6,211 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారన్నారు. గంభీరావుపేట, ఇల్లంతకుంట, ముస్తాబాద్, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, చందుర్తి మండలాల్లో ఐకేపీ కేంద్రాలు, మిగితా ప్రాంతాల్లో పీఏసీఎస్ కేంద్రాల ద్వారా కందులు కొనాలని సూచించారు. 12 శాతం తేమ ఉంటే రూ.7,550 మద్దతు ధర లభిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment