● భూముల సర్వే సాగేదెలా? ● జిల్లాలో సర్వేయర్ల ఖాళీలు ● జ
సిరిసిల్ల: జిల్లాలో సర్వేయర్ల కొరత వేధిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాలకు 8 మంది మాత్రమే సర్వేయర్లు ఉన్నారు. జిల్లా స్థాయి అధికారి పోస్టు ఖాళీగానే ఉంది. ఏడాదిగా ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. తమ భూమి హద్దులు చూపాలంటూ జిల్లాలోని రైతులు ప్రతీ నెల ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటున్నారు. సర్వేయర్లు లేక క్షేత్రస్థాయిలో సర్వే చేయడం లేదు. ఫలితంగా జిల్లాలోని చాలా గ్రామాల్లో భూవివాదాలు సద్దుమణగడం లేదు.
91,416 సర్వేనంబర్లు.. 4,68,532 ఎకరాలు
జిల్లాలోని 13 మండలాల వ్యాప్తంగా 171 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 91,416 సర్వేనంబర్లలో 4,68,532 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను ఐదు దశాబ్దాల క్రితం సర్వే చేయగా, ప్రస్తుతం హద్దులు చెరిగిపోయి వివాదాస్పదంగా మారుతున్నాయి. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి, వేములవాడరూరల్, రుద్రంగి మండలాల్లో సర్వేయర్లు లేరు. వేములవాడ డివిజన్ డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ప్రతీ నెల రైతులు భూసర్వే కోసం రూ.40వేల వరకు చెల్లిస్తున్నారు.
డబ్బులు చెల్లించి నిరీక్షణ
భూముల సర్వేకు సంబంధించి ఒక్కో సర్వే నంబర్‌కు మండల సర్వేయర్‌కు రూ.250, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్(జిల్లా స్థాయిలో) అయితే రూ.300 ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించినా సర్వేలు జరగడం లేదు. సర్వేనంబర్ సరిహద్దుల భూముల యజమానులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామాల్లో వీఆర్‌ఏ(విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు) లేకపోవడంతో నోటీసులు జారీ చేయడం లేదు. మరోవైపు ప్రభుత్వపరంగా రైల్వేలైన్, అదనపు టీఎంసీ భూసేకరణ, పోడుభూముల హద్దుల నిర్ధారణ, సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ వంటి పనుల్లో సర్వేయర్లు బిజీగా ఉంటున్నారు. దీంతో వందలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి.
భూముల ధరలు పెరిగి వివాదాలు
జిల్లాలో భూముల ధరలు బాగా పెరిగాయి. ఎక్కడ చూసినా ఎకరాకు రూ.20లక్షలకు తక్కువ లేదు. దీంతో సరిహద్దు వివాదాలు తలెత్తుతున్నాయి. ప్ర భుత్వ సర్వేయర్లు అయితే.. భూమి హద్దుల నక్షా(టీపన్) ప్రకారం కొలతలు నిర్ధారిస్తారని రైతులు ఆశిస్తున్నారు. ఏటా వర్షాకాలం ప్రారంభంలోనే భూ హద్దుల సమస్యలు తలెత్తుతూ శాంతిభద్రత స మస్యలుగా పరిణమిస్తున్నాయి. జిల్లాలో సర్వేయర్‌శాఖ అధికారులు డిజిటల్ గ్లోబల్ పోజిషల్ సిస్టమ్ (డీజీపీఎస్) విధానంలో శాటిలైట్ అనుసంధానంతో సర్వే చేయడంతో భూసేకరణ పనులు వేగవంతమయ్యాయి. అయినా సర్వే కోసం చలానా చెల్లించిన రైతులు వందల్లో ఉన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మండలానికి ఒక సర్వేయర్‌తోపాటు డివిజన్ స్థాయిలోనూ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లను, జిల్లా అధికారిని నియమించాల్సిన అవసరం ఉంది.
జిల్లాలో దరఖాస్తులు ఇలా..
మండల సర్వేయర్ల కోసం 211
డివిజన్ సర్వే ఇన్‌స్పెక్టర్ 78
జిల్లా సర్వే ఇన్‌స్పెక్టర్ 89
మొత్తం 378
సర్వే నంబరు, రైతుల వివరాలు
మండలం సర్వే నం. రైతులు
సిరిసిల్ల 2,565 3,287
తంగళ్లపల్లి 9,107 10,387
గంభీరావుపేట 9,423 9,691
ముస్తాబాద్ 9,633 11,192
ఎల్లారెడ్డిపేట 11,753 9,782
వీర్నపల్లి 1,148 3,018
వేములవాడఅర్బన్ 4,950 5,039
వేములవాడరూరల్ 6,081 6,415
ఇల్లంతకుంట 11,911 14,588
బోయినపల్లి 8,692 9,013
కోనరావుపేట 8,539 9,867
చందుర్తి 6,367 8,110
రుద్రంగి 1,247 2,751
మొత్తం 91,416 1,03,140
Comments
Please login to add a commentAdd a comment