మహాజాతరకు సిద్ధం
● భక్తులకు సౌకర్యాలు కల్పిస్తాం ● అదనంగా రెండు లడ్డూ కౌంటర్లు
● 3.50 లక్షల లడ్డూలు రెడీ ● వేములవాడ రాజన్న ఆలయ ఈవో వినోద్‌రెడ్డి
వేములవాడఅర్బన్: మహాశివరాత్రి జాతరకు వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. ఈనెల 25, 26, 27వ తేదీల్లో జరిగే ఉత్సవాలకు ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. వేసవి దృష్ట్యా భక్తులు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే చర్చించినట్లు తెలిపారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు, వేడుకల నిర్వహణ ఎలా ఉంటుందని ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఈవో వినోద్‌రెడ్డి పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే..
దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న క్షేత్రంలో మూడు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ వేడుకలకు 4లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా. ఇప్పటికే 3.50లక్షల లడ్డూల తయారు చేశాం. లడ్డూ కౌంటర్లను అదనంగా మరో రెండు.. ఆంధ్రాబ్యాంక్, కట్టమీద వాహనాల పూజషెడ్డులో ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం వేములవాడలో 450 ఆలయ వసతి గదులు ఉన్నాయి. ఇందులో జాతర విధులకు వచ్చే అధికారులకు, దాతలకు కేటాయిస్తాం. మిగిలినవి భక్తులకు అందుబాటులో తీసుకొస్తాం. భక్తులకు అద్దెగదుల కోసం టీటీడీ ధర్మశాల జాతరగ్రౌండ్‌లోని ఆఫీస్‌లో గదులు ఇవ్వనున్నాం. భక్తులకు లక్ష్మీగణపతి సదన్‌లో ఉచిత అన్నదానం, గుడిచెరువు ప్రాంతంలో టిఫిన్ అందజేస్తాం.
భక్తులు స్వామివారిని త్వరగా దర్శనం జరిగేలా క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నాం. భక్తుల కోసం ధర్మదర్శనం, కోడె క్యూలైన్, రూ.100 దర్శనం, రూ.300 దర్శనం, వీఐపీ దర్శనం ఇలా ఐదు క్యూలైన్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. ఆలయ ఆవరణ, గుడిచెరువుల్లో చలువ పందిళ్లు వేయిస్తున్నాం. ఉత్సవాల సమయంలో కోడెమొక్కులు ఎక్కువగా చెల్లించుకునే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా కోడెలను 4 గంటలకో షిఫ్టు చొప్పున మార్చాలని నిర్ణయించాం. ఒక్కో షిష్టులో 60 కోడెలను అందుబాటులో ఉంచుతాం. ధర్మగుండాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తాం. పరిశుభ్రమైన నీటిని ఉంచుతాం.
4 లక్షల మంది వస్తారని అంచనా
పారిశుధ్య పనులపై దృష్టి
మహాశివరాత్రి జాతరలో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. రెగ్యులర్‌గా 109 మంది పారిశుధ్య సిబ్బంది ఉండగా, అదనంగా 1200 మందిని పిలిపిస్తున్నాం. ఈనెల 24 నుంచి 28 వరకు షిప్టులవారీగా పనిచేస్తారు. భక్తుల కోసం ఆలయ పరిసరాలు, గుడిచెరువులో 350 టాయిలెట్స్, పట్టణంలో మరో 100 ఏర్పాటు చేస్తున్నాం. శివదీక్ష స్వాములకు ఈనెల 26న సాయంత్రం 4 గంటలకు దర్శన అవకాశం కల్పిస్తున్నాం. తలనీలాల సమర్పణ కోసం అదనంగా రెండు కల్యాణకట్టలను, ఆలయ పరిసరాల్లో 20 హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నాం. మూడు రోజులపాటు తిప్పాపూర్ నుంచి గుడి చెరువు వరకు 14 మినీ ఉచిత బస్సులను నడిపిస్తున్నాం.
షిఫ్టుల వారీగా కోడెలు
మహాజాతరకు సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment