వజ్రోత్సవాలు నిర్వహించడం అభినందనీయం
వేములవాడరూరల్: వేములవాడ మండలం హన్మాజిపేట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న 75 ఏళ్ల వజ్రోత్సవాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి లేఖలో శుభాకాంక్షలు తెలిపారు. సుప్రసిద్ధ కవి, రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి స్వగ్రామం హన్మాజిపేట. సినారె చిన్నప్పుడు చదువుకున్న ఈ బడిని తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు పునర్నిర్మించడం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు, అడుగుజాడలు హన్మాజిపేటను రాష్ట్రంలోనే ఉన్నతమైన ఆదర్శాలకు నిలయంగా తీర్చిదిద్దాయని కొనియాడారు. వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్న గ్రామస్తులు, ఉపాధ్యాయులు, పూర్వ విదార్థులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 75 ఏళ్లుగా అంకితభావం, శ్రద్ధ, పట్టుదలతో అనేక మంది విద్యార్థులకు ఈ పాఠశాల విద్యాబుద్ధులు నేర్పిందని, ఇక్కడి ఉపాధ్యాయుల కృషి, గ్రామస్తుల సహకారానికి ఈ వజ్రోత్సవాలు అసలు సిసలైన నిదర్శనమని పేర్కొన్నారు. ఈ పాఠశాలలో చదివి మన రాష్ట్రంతో పాటు దేశస్థాయిలో కీర్తి ప్రతిష్టలు సాధించినవారు, వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగినవారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఉత్సవాలు రెండు రోజులపాటు జరగనున్నాయి. మొదటి రోజు పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు ఆటల పోటీల్లో పాల్గొన్నారు.
లేఖలో శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment