విజయోస్తు..
● నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ● అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
సిరిసిల్లఎడ్యుకేషన్: జిల్లాలో బుధవారం నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశా రు. ఏడాదిపాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోబోతున్నారు. అయితే ఇదే సమయంలో టెన్షన్ పడొద్దని.. ఆహారం.. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉంటాయన్న భయం మనసులో పెట్టుకోవద్దని.. అన్ని పరీక్షల మాదిరిగానే వీటిని తీసుకుంటే ఎలాంటి ఆందోళన ఉండదంటున్నారు.
9,310 మంది విద్యార్థులు
ఈనెల 5 నుంచి 25 వరకు జరిగే పరీక్షలకు జిల్లాలో ఫస్టియర్‌లో 5,065, సెకండియర్‌లో 4,245 మంది విద్యార్థులకు హాజరుకానున్నారు. 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు తాగునీరు ఇతర సదుపాయాలు కల్పించినట్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
సీసీ కెమెరాలు.. తనిఖీ బృందాలు
ఈసారి కేంద్రాల్లో సీసీ కెమెరాలు బిగించారు. పరీక్ష సమయంలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా ఉండేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో తనిఖీ బృందాలు సైతం కేంద్రాల్లో తనిఖీ చేయనున్నాయి. జిల్లాలో 16 కేంద్రాల్లో 16 మంది సీఎస్‌లు, 16 మంది డీవోలు, ఐదుగురు అడిషనల్ సీఎస్‌లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లో తహసీల్దార్, జూనియర్ లెక్చరర్, ఆర్‌ఎస్‌ఐ ఉంటారు. జిల్లా కమిటీలో ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి, సీనియర్ ప్రిన్సిపాల్, సీనియర్ లెక్చరర్ పర్యవేక్షిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్స్‌గా ఇద్దరు జూనియర్ లెక్చరర్లు తనిఖీలు చేస్తారు.
భయం వద్దు
ఇంటర్ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా ఉండేందుకు ఈసారి పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనిపై విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరీక్ష కేంద్రాన్ని తెలిపేలా క్యూఆర్ కోడ్ డైరెక్షన్ కోసం హాల్‌టికెట్‌పై ముద్రించి ఉంది. దీంతో విద్యార్థులు కేంద్రానికి సకాలంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు పరీక్షలకు సకాలంలో వెళ్లి సక్సెస్ అవుతామని దృఢ నమ్మకంతో ముందుకెళ్లాలి.
– వై.శ్రీనివాస్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి
ఆహారం, నిద్రపై దృష్టిపెట్టాలి
విద్యార్థులు పరీక్షల సమయంలో చదవడంతో పాటు నిద్రకు సమయం కేటాయించడం మంచిది. రోజువారి ఆహారం మాదిరి కాకుండా త్వరగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
– డాక్టర్ సురేంద్రబాబు, పిల్లల వైద్య నిపుణుడు, సిరిసిల్ల
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
పరీక్షల సమయంలో రాత్రి పొద్దుపోయే వరకు చదవకూడదు. తగినంత నిద్ర పోవాలి. టీవీ, మొబైల్‌లకు దూరంగా ఉండాలి.
త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, పండ్లు, రసాలు తీసుకోవడం మంచిది.
పరీక్ష కేంద్రానికి వెళ్లే వరకు చదువుతూ ఉండొద్దు.
పరీక్ష రాసేందుకు అవసరమైన హాల్‌టికెక్, పెన్నులు, పెన్సిళ్లు సమకూర్చుకోవాలి.
ఎలాంటి భయాందోళన చెందొద్దు.
కేంద్రానికి కనీసం గంట ముందు చేరుకోవాలి.
ఒక పరీక్ష రాసి ఇంటికొచ్చిన తర్వాత దాని గురించే చర్చించవద్దు. మరుసటి రోజు పరీక్షపై దృష్టి పెట్టాలి.
విజయోస్తు..
విజయోస్తు..
Comments
Please login to add a commentAdd a comment