సరిపడా నీరు తాగాలి
● అవసరమైతేనే బయటకు వెళ్లాలి ● మార్చి నుంచే మండుతున్న ఎండలు ● వడదెబ్బకు గురైతే వెంటనే చికిత్స తీసుకోవాలి ● వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలి ● ‘సాక్షి’తో డీఎంహెచ్‌వో రజిత
సిరిసిల్లటౌన్: ‘ఈసారి మార్చి ఆరంభం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇప్పటినుంచి జూన్ మాసం ప్రథమార్థం వరకు సూర్యతాపం కొనసాగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ప్రజలు తగినంత నీటిని తీసుకుంటూ, శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసుకోవాలి’ అని డీఎంహెచ్‌వో డాక్టర్ రజిత పేర్కొన్నారు. వేసవిలో ఎదురయ్యే అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం ‘సాక్షి’కి వివరించారు.
శరీర ఉష్ణోగ్రత పెరిగితే..
ఎండలు ఎక్కువైనప్పుడు శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతుంది. దీంతో శరీరంలో నీరు బాగా పోవడం వల్ల డీహైడ్రేషన్ (నిర్జలీకరణ)తో పాటుగా జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, విరేచనాలు, గుండెలయలో మార్పులు, రక్తపోటు(బీపీ)లో హెచ్చుతగ్గులు, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రనాళ సమస్యలు, వేడి దద్దుర్లు(హీట్ ర్యాషెస్) వచ్చే అవకాశం ఉంటుంది.
తగినంత ఆక్సిజన్ అవసరం
వేసవిలో సాధారణంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. శరీరానికి సరిపడా నీరు తాగకపోవడంతో పాటు, గాలిలో తేమశాతం తక్కువగా ఉండి శరీరం నుంచి బయటకు ఎక్కువగా విసర్జిస్తుంది. దీంతో పలురకాల సమస్యలు వస్తాయి. మన శరీరంలో కండరాలకు తగిన ఆక్సిజన్ అవసరం. ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరంలో నీరు తగ్గినప్పుడు కండరాలు పట్టేస్తాయి. కండరాలకు శరీరం నుంచి తగిన ఆక్సిజన్ అందనప్పుడు ఇతర మార్గంలో అవసరాలు తీర్చుకునే క్రమంలో ల్యాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తాయి. దీంతో కిడ్నీలపై ప్రభావం చూపి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. నీళ్ల విరేచనాలతో కూడా కిడ్నీలు పాడవడానికి అవకాశం ఉంటుంది.
దీర్ఘకాలిక రోగులు జాగ్రత్తగా ఉండాలి
బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే డాక్టర్‌ను సంప్రదించి వారి సూచనలను పాటించాలి. వేసవిలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు తలనొప్పి తొలి హెచ్చరికగా భావించాలి. వెంటనే తగ్గకుంటే డాక్టర్‌ను సంప్రదించాలి. ఈకాలంలో ఒత్తిడి, నిద్రలేమి, చికాకు, ఉత్సాహం తగ్గడం, నీరసించిపోవడం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి.
సాధారణ నీరు.. వ్యాయామం
వేసవిలో అతిచల్లని నీటిని అస్సలు తాగొద్దు. అతిగా వ్యాయామం కూడా చేయడం సరికాదు. తగిన విరామంతో సరిపడా నీరు తీసుకుంటూ వ్యాయామం చేయాలి. ఇక చల్లని నీటితో స్నానం చేయడం, శరీర భాగాలను కడుక్కోవడం సరికాదు. ఎండల్లో తిరిగొచ్చిన వారు ఒక్కసారిగా చల్లని నీటిని తాగితే.. స్నానం చేస్తే రక్తనాళాలు కుచించుకుపోయే అవకాశం ఉంటుంది. దీంతో గుండెపోటుకు గురయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి ఎండ నుంచి వచ్చిన వారు సాధారణ నీరు తాగడం శ్రేయస్కరం. చల్లని నీరు, రసాలు తీసుకోవడంతో గొంతు నొప్పి, ఇతర సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలి.
జాగ్రత్తలు..
రోజూ ఎండలో కాకుండా నీడ ప్రదేశాల్లో ఉండేందుకు ప్రాధాన్యం ఇన్నాలి. శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా నీరు తాగాలి. ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. సీ విటమిన్ పుష్కలంగా ఉండే పదార్థాలు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ వంటివి తీసుకోవాలి.
ఇక కాటన్, పలుచటి వస్త్రాలు ధరించడం మంచిది. పనికి వెళ్లిన వారు ఏకధాటిగా ఎండలో ఉండకుండా మధ్యలో విరామం ఇవ్వాలి. మండుటెండలకు బయటకు వెళ్లకుండా ఉండటం శ్రేయస్కరం. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వేసవిలో ఆహార పదార్థాలు త్వరగా చెడిపోతుంటాయి. వాటిని తీసుకుంటే అనారోగ్యాన్ని పొందడం ఖాయం. తాజా ఆహారమే తీసుకోవాలి.
వడదెబ్బకు గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వడదెబ్బకు గురైన వ్యక్తులను చల్ల ని ప్రదేశాల్లో ఉంచాలి. సాల్టెడ్ బటర్ మిల్క్ లేదా గ్లూకోజ్ వాటర్‌తో పాటు పుష్కలంగా నీటిని తీసుకోవాలి. వడదెబ్బతో బాధపడుతున్న వ్యక్తులను చల్లటి నీటితో స్పాంజ్ చేయాలి. అయినా మెరుగుదల కనపడకపోతే వెంటనే ఆసుపత్రికి తరలించాలి. అర్హత గల వైద్యుడితో చికిత్స పొందాలి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా మెరుగైన వైద్యసేవలు పొందవచ్చు.
సరిపడా నీరు తాగాలి
Comments
Please login to add a commentAdd a comment