
అర్జీలను వెంటనే పరిష్కరించాలి
● ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం చేయొద్దు ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● 153 దరఖాస్తుల స్వీకరణ
సిరిసిల్లటౌన్: ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ సమస్యలపై 153 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా రెవెన్యూకు 62 అర్జీలు వచ్చాయి. సిరిసిల్ల ఇన్‌చార్జి ఆర్డీవో రాధాబాయ్, డీఆర్డీవో శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
వయోధికుల చట్టాలపై అవగాహన అవసరం
వయోధికుల పోషణ, సంక్షేమచట్టాలపై పౌరులు, సీనియర్ సిటిజెన్స్‌కు అవగాహన అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వయోధికుల చట్టంలోని అంశాలను తెలుగులో ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య, ఇన్‌చార్జి ఆర్డీవో రాధాబాయి, సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి లక్ష్మీరాజం, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, సంఘం బాధ్యులు దొంత దేవదాసు, అంకారపు జ్ఞానోబా, వికృతి ముత్తయ్య, ముకుందం పాల్గొన్నారు.
అట్రాసిటీ కేసులలో పరిహారం పంపిణీ
సిరిసిల్ల: జిల్లాలో అట్రాసిటీ కేసులలో పరిహారాన్ని బాధితులకు పంపిణీ చేసినట్లు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. జిల్లాలో నమోదైన కేసుల ఆధారంగా ఎస్సీ, ఎస్టీలు 46 మంది బాధితులకు రూ.36.87లక్షలు వారి ఖాతాల్లో జమచేసినట్లు వివరించారు. ముస్తాబాద్ మండలంలో మూడు, కోనరావుపేటలో ఆరు, వేములవాడ అర్బన్, రూరల్ మండలాల్లో 12, సిరిసిల్ల మండలంలో ఐదు, చందుర్తిలో మూడు, బోయినపల్లిలో నాలుగు, తంగళ్లపల్లి మండలంలో ఐదు, గంభీరావుపేటలో రెండు, ఎల్లారెడ్డిపేటలో రెండు, ఇల్లంతకుంట మండలంలో మూడు, జగిత్యాల జిల్లాలో ఒకరికి పరిహారం సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ వివరించారు.
చెరువులు నింపాలి
వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలోని దొంపిచెరువు, పామిరెడ్డి చెరువులను డీ6, డీ7 కెనాల్ ద్వారా నింపాలి. ప్రస్తుతం చెరువుల్లో నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలంలో నీటికష్టాలు పెరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించాలి. – గుడిసె విష్ణువర్ధన్, వట్టెంల

అర్జీలను వెంటనే పరిష్కరించాలి
Comments
Please login to add a commentAdd a comment