టార్గెట్‌ నంబర్‌ వన్‌ | - | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ నంబర్‌ వన్‌

Published Tue, Mar 11 2025 12:13 AM | Last Updated on Tue, Mar 11 2025 12:13 AM

టార్గ

టార్గెట్‌ నంబర్‌ వన్‌

● వంద శాతం లక్ష్యంగా ముందుకు.. ● పన్ను వసూలులో ప్రణాళికతో ముందుకు.. ● సిరిసిల్లలో 82 శాతం.. వేములవాడలో 72 శాతం వసూలు

సిరిసిల్లటౌన్‌/వేములవాడ: పన్నుల వసూళ్లలో అగ్రస్థానమే లక్ష్యంగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు ముందుకెళ్తున్నాయి. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రస్థాయిలో సిరిసిల్ల బల్దియా అగ్రస్థానం సాధించిన విషయం తెలిసిందే. అదే స్ఫూర్తితో మున్సిపల్‌ అధికారులు స్పెషల్‌ డ్రైవ్స్‌ చేపడుతున్నారు. వేములవాడలోనూ వందశాతం లక్ష్యంగా అధికారులు క్షేత్రస్థాయిలో వసూళ్లు చేస్తున్నారు. ఇప్పటికే సిరిసిల్లలో 82 శాతం, వేములవాడలో 72 శాతం పన్నులు వసూలు చేసిన అధికారులు ఈనెలాఖరులోగా వంద శాతం చేరుకోవాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

లక్ష్యం రూ.6.32కోట్లు వసూలు రూ.5.18కోట్లు

సిరిసిల్ల మున్సిపల్‌కు సంబంధించిన పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. కలెక్టర్‌ ప్రత్యేకాధికారిగా ఉన్న తరుణంలో ఆయన సూచనలతో గత ఆర్థిక సంవత్సరాల్లో సాధించిన నూరుశాతం పన్నుల వసూళ్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. మున్సిపల్‌లో లోటు బడ్జెట్‌ తీర్చడంతోపాటు గతకీర్తిని కొనసాగించడమే లక్ష్యంగా ప్రైవేటు ఆస్తుల పన్నుల వసూలుకు చర్యలు తీసుకుంటుంది. సిరిసిల్ల పట్టణంలో నివాసగృహాల పన్ను వసూలుకు మున్సిపల్‌ అధికారులు రెండు నెలలుగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. రెసిడెన్షియల్‌, నాన్‌రెసిడెన్షియల్‌, ఇతర ఆస్తులకు సంబంధించిన పన్నులు రూ.6.32కోట్లు ఉండగా ఇప్పటికే రూ.5.18 కోట్లు సుమారుగా 82 శాతం వసూలయ్యాయి.

ఆదాయంపై వినూత్న విధానాలు

బల్దియా ఆదాయవనరుల పెంపుపై అధికారులు దృష్టి సారించారు. పరిశుభ్ర పట్టణంగా కీర్తిపొందిన సిరిసిల్ల వీధుల్లో చెత్తను వేయడం నిషేధించారు. నిబంధన ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ప్రతీ దుకాణం నుంచి తడి, పొడి చెత్తను సేకరించేందుకు విధిగా ఒక్కో దుకాణదారుడి నుంచి రూ.300 వరకు యూజర్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక మున్సిపల్‌ ఆస్తులు ఆక్రమించడం అంటే రోడ్డుపై టేలాలు వేయడం, వ్యాపారాలు చేయడం, ఫుట్‌పాత్‌లు ఆక్రమించడం తదితర అంశాలపై కూడా నిత్యం దాడులు చేస్తూ ఆదాయం పెంచారు. గృహాల పన్నులే కాకుండా ట్రేడ్‌లైసెన్సులు, తాగునీరు తదితర పన్నులు పూర్తిస్థాయిలో వసూలు చేసేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు.

39 వార్డులు..14 బృందాలు

పన్నుల వసూలుకు 39 వార్డుల్లో 14 మంది బిల్‌కలెక్టర్లతో గ్రూపులను ఏర్పాటు చేశారు. వీరి తో పాటు ఒక వార్డు ఆఫీసర్‌, ఒక సూపర్‌వైజర్‌తో పాటు అవసరమైన వార్డుల్లో మరికొంత మంది సిబ్బంది గ్రూపులుగా ఏర్పడి నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో పన్నులు వసూలు చేస్తున్నారు. పట్టణంలో రెసిడెన్షియల్‌ 18,113, నాన్‌రెసిడెన్షియల్‌ 2,569, ఇతర ఆస్తులు 2,805 మొత్తంగా 23,487 ఉన్నాయి. పన్నుల వసూళ్లకు మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.సమ్మయ్య నేతృత్వంలో సిబ్బంది ఫిబ్రవరి నుంచే కార్యాచరణ చేపట్టారు.

అభివృద్ధి.. పన్నుల చెల్లింపు

అభివృద్ధిలో రాష్ట్ర స్థాయిలోనే ముందంజలో సిరిసిల్ల ఖ్యాతి గడించింది. అన్నివార్డుల్లో రోడ్లు, మోరీల నిర్మాణం, ఎల్‌ఈడీ వీధిదీపాలు, ప్రధాన రోడ్లవెంట పచ్చదనంతో పట్టణం అభివృద్ధి సాధించింది. పట్టణాన్ని చూడగానే ఆహా అనిపించే డివైడర్లు, మానేరుతీరంలో బతుకమ్మ ఘాట్‌, మ్యూజికల్‌ ఫౌంటేయిన్‌, పట్టణం దశదిశలా ఏర్పాటైన పార్కులతో సిరిసిల్ల మహానగరాలకు తీసిపోని విధంగా ఆవిర్భవించింది. దీంతో ప్రజలు కూడా తమవంతుగా పన్నుల వసూళ్లలో బల్దియాకు దన్నుగా నిలుస్తున్నారు.

వేములవాడలో 72 శాతం వసూలు

వేములవాడ మున్సిపల్‌ అధికారులు మున్సిపల్‌ ఆస్తిపన్నుల వసూళ్లపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సం మార్చి 31తో ముగియనుండటంతో ఆస్తిపన్ను వసూలుపై అధికారులు దృష్టిపెట్టారు. వేములవాడ మున్సిపల్‌, విలీన గ్రామాలు కలిపి 28 వార్డులు ఉన్నాయి. ప్రతీ వార్డులో ప్రతి రోజు అధికారులు ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. ఈ ఆస్తి పన్నుల వసూళ్ల కోసం 5 ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

72 శాతం వసూలు

వేములవాడ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 72 శాతం ఆస్తిపన్ను వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.4.32 కోట్లు లక్ష్యం కాగా.. రూ.3.11కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.1.21కోట్లు వసూలు చేయాల్సి ఉంది. వేములవాడ రాజన్న ఆలయం నుంచి ఆస్తి పన్ను రూ.1.09కోట్లు వసూలు చేశారు. ఇప్పటి వరకు మున్సిపల్‌ ఆస్తి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.4.20 కోట్లు వసూలయ్యాయి. మిగతా ఆస్తిపన్నులు ఈనెలాఖరు వరకు పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు అధికారులు ముందుకెళ్తున్నారు.

జిల్లాలో ఆస్తులు ఇలా..

ఆస్తి సిరిసిల్ల వేములవాడ

గృహాలు 18,113 11,371

కమర్షియల్‌ 2,569 2,266

ఇతరాలు 2,805 1,052

రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు 45 207

కేంద్ర ప్రభుత్వ ఆస్తులు – 01

మొత్తం ఆస్తులు 23,532 14,897

మొదటి స్థానం సాధిస్తాం

పన్నుల వసూళ్లలో కలెక్టర్‌ ఆదేశాలు, సూచనలతో ఆదర్శ విధానాలు అవలంబిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉన్నాం. నెలాఖరు వరకు నూరుశాతం వసూళ్లు చేసి నంబర్‌ వన్‌ స్థానాన్ని సాధిస్తాం. డీఈఈ, ఏఈలు, టీపీవో, టీపీబీవో, ఆర్‌ఐ, ఆర్‌వోలు, బిల్‌కలెక్టర్లు ఇలా 39 మంది నిత్యం పన్నులు వసూలు చేస్తున్నారు. – ఎస్‌.సమ్మయ్య,

మున్సిపల్‌ కమిషనర్‌, సిరిసిల్ల

వందశాతం పూర్తి చేస్తాం

వేములవాడ మున్సిపల్‌లో ఆస్తిపన్ను స్పెషల్‌డ్రైవ్‌ ఏర్పాటు చేసి పన్నుల కోసం ప్రత్యేకాధికారులను కేటాయించి 72 శాతం ఆస్తి పన్ను వసూలు చేశాం. మార్చి నెలాఖరు వరకు వందశాతం ఆస్తిపన్ను వసూలు చేస్తాం. – అన్వేశ్‌,

వేములవాడ మున్సిపల్‌ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
టార్గెట్‌ నంబర్‌ వన్‌1
1/2

టార్గెట్‌ నంబర్‌ వన్‌

టార్గెట్‌ నంబర్‌ వన్‌2
2/2

టార్గెట్‌ నంబర్‌ వన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement