క్రమబద్ధీకరణ అయ్యేనా?
● ఈనెలాఖరు వరకు గడువు ● 42,942 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు ● ఫీజులో 25 శాతం రాయితీ ● ప్రాసెస్‌లో 34,229 అర్జీలు
ముస్తాబాద్(సిరిసిల్ల): అనధికార లేఅవుట్లు, అనుమతులు లేని ప్లాట్ల క్రమబద్ధీకరణకు స్పందన లభించడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఏడాదిగా ఎల్‌ఆర్‌ఎస్ అర్జీలను క్రమబద్ధీకరించేందుకు చేపట్టిన ప్రక్రియ అనుకున్న స్థాయిలో ముందుకుసాగడం లేదు. దీంతో ప్రభుత్వం ఈనెల 31లోగా పాట్ల క్రమబద్ధీకరణకు గడువు విధించింది. గడువులోగా ఫీజులు చెల్లించిన వారికి 25శాతం రాయితీ ప్రకటించింది. దీనిపై ప్లాట్ల యజమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
దరఖాస్తుల వడబోత
జిల్లాలో గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తులు ఆహ్వానించగా రూ.వెయ్యి చెల్లించినవారు 42,942 మంది ఉన్నారు. వీరి పూర్తి వివరాలను ప్రస్తుతం అధికారులు వడబోసి అందరికీ సమాచారం అందించారు. అందులోంచి 34,229 దరఖాస్తులకు ప్రాసెస్ మొదలు పెట్టారు. వీరి ప్లాట్లను రెగ్యులర్ చేసేందుకు ఫీజు చెల్లించేలా గ్రామపంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు లేఅవుట్ స్థలాలను కొనుగోలు చేసిన వారికి సిబ్బంది, ఉద్యోగులు ఫోన్‌లో సమాచారం ఇస్తున్నారు. 25 శాతం రాయితీతో ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని చెబుతున్నారు. 2020లో చేసుకున్న దరఖాస్తుదారులు తమ ప్లాట్లను విక్రయించినా, రిజిస్ట్రేషన్ సమయంలో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించినా సరిపోతుందనే అవకాశం ఇచ్చారు. దీనిపై సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్ 18002331495 ఏర్పాటు చేశారు.
క్రమబద్ధీకరణపై నిఘా
ఎల్‌ఆర్‌ఎల్‌లో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ఆచితూచి అనుమతులు ఇస్తున్నారు. చెరువులు, కుంటలకు 200 మీటర్లలోపు ఉన్న వాటిని రెగ్యులర్ చేయరు. అలాగే బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్, నీటివనరులు, వాగులు, నదుల వద్ద ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించే సమయంలో పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న లేఅవుట్లలో ఎన్ని డీటీసీపీ అనుమతులు పొందాయో తెలుసుకుంటున్నారు. స్థలాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశారు. మున్సిపల్, పంచాయతీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం రెగ్యులర్ చేసే ప్లాట్ల వివరాలకు సంబంధించి ఫీజు ఎంత మేరకు నిర్ణయించారో తెలుసుకునేందుకు, స్థలాల యజమానులు తమ ఫోన్ నంబర్లతో మీసేవలో విచారణ చేస్తే ఎంతమేరకు ప్రభుత్వం ఫీజు విధించిందో తెలుసుకోవచ్చు.
రెగ్యులర్ కాని ప్లాట్లతో పాట్లే
ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా క్రమబద్ధీకరించుకోని స్థలాల యజమానులు భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అధికారులు సూచించిన విధంగా ఆన్‌లైన్‌లో వచ్చే ఫీజును చెల్లించని పక్షంలో, భవిష్యత్‌లో అక్కడ నిర్మాణాలకు అనుమతులు లభించవు. క్రమబద్ధీకరించని స్థలాల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతులు ఉండబోవు. జిల్లాలో ప్రస్తుతం 8,713 దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
యజమానులపై భారం
సమాచారం ఇస్తున్నాం
ముస్తాబాద్‌లో 757 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు వచ్చాయి. అందరికీ సమాచారం ఇస్తున్నాం. పంచాయతీలోనే ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశాం. అప్పటికప్పుడే నిర్మాణాలకు అనుమతులు ఇస్తాం.
– రమేశ్, ముస్తాబాద్ మేజర్ పంచాయతీ ఈవో
వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి
డీటీసీపీ అనుమతులు లేకుండా ప్లాట్లు విక్రయించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. క్రమబద్ధీకరణకు 25 శాతం రాయితీ ఇవ్వడం మంచిదే. భవిష్యత్‌లో ప్లాట్ల వ్యాపారాలపై మరింత కఠినంగా వ్యవహరిస్తే సామన్యులకు నష్టం జరుగదు.
– లింగం, ముస్తాబాద్
ప్లాటు కొనుగోలు చేసిన యజమానులు ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణతో భారం మోసే పరిస్థితులు వచ్చాయి. అక్రమ లేఅవుట్లు వేసిన వారి వద్ద ఎలాంటి విచారణ చేయకుండా, ముఖ్యంగా డీటీసీపీ అనుమతులు ఉన్నాయో, లేదో చూసుకోకుండా ప్లాట్లు కొని పాట్లు పడుతున్నారు. రియల్ వ్యాపారులు, వెంచర్ల యజమానులు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపులు చేసే పరిస్థితుల్లో లేరు. వారు బాగానే ఉన్న, ప్లాట్లు కొన్న తామే ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. 150 గజాల స్థలం ఉన్న వారికి సుమారు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు ఫీజు వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి క్రమబద్ధీకరణ ఒక మార్గం కాగా, ప్లాట్లు కొన్నవారే అంతిమంగా నష్టపోతున్నారు.
క్రమబద్ధీకరణ అయ్యేనా?
క్రమబద్ధీకరణ అయ్యేనా?
క్రమబద్ధీకరణ అయ్యేనా?
Comments
Please login to add a commentAdd a comment