పట్టభద్రుల సీటూ కమలానిదే! | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల సీటూ కమలానిదే!

Published Thu, Mar 6 2025 1:29 AM | Last Updated on Thu, Mar 6 2025 1:28 AM

పట్టభ

పట్టభద్రుల సీటూ కమలానిదే!

కమలంలో జోష్‌.. హస్తంలో నైరాశ్యం!

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌/సాక్షి,పెద్దపల్లి:

రీంనగర్‌–ఆదిలాబాద్‌–నిజామాబాద్‌– మెదక్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్‌ అంజిరెడ్డి విజయం సాధించారు. మూ డు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్‌ రౌండ్స్‌తో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖ రారైంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా ఓట్లు రాకపోయినా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి అత్యధిక ఓట్లు రావడంతో విజేతగా ప్రకటించారు. చివరి వరకు హోరా హోరీగా పోరాడిన కాంగ్రెస్‌ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం సాధించటంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగ్గా, మార్చి 3న కౌంటింగ్‌ ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్విరామంగా మూడు షిప్ట్‌ల్లో 800 మంది కౌంటింగ్‌ సిబ్బంది కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ స్టేడియంలో 21 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించిన అధికారులు, మంగళవారం మధ్యాహ్నం వరకు చెల్లని ఓట్లను వడపోసి, కట్టలు కట్టారు. మంగళవారం రాత్రి నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్‌ ప్రారంభించి, బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి ఎలిమినేషన్‌ రౌండ్స్‌ను ప్రారంభించారు. ఎలిమినేషన్‌ రౌండ్స్‌లో బరిలో ఉన్న 54 మందిలో తక్కువ ఓట్లు కలిగి ఉన్న వారిని ఒక్కొక్కరిగా తొలగిస్తూ, వారికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లును మిగిలిన అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్‌ ప్రక్రియను మూడు రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగించారు.

ముగ్గురికే 92.52శాతం ఓట్లు

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చెల్లుబాటు అయిన ఓట్లల్లో 92.52శాతం (2,06,659) మొదటి ప్రాధాన్యత ఓట్లు ఈ ముగ్గురికే వచ్చాయి. మిగిలిన 53 మంది ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కేవలం 16,684 ఓట్లు మాత్రమే సాధించారు.

రెండో ప్రాధాన్యత ఓట్లలో సైతం బీజేపీదే హవా

నిర్ధారిత కోటా ఓట్ల కోసం అభ్యర్థుల ఎలిమినేషన్‌ ప్రక్రియను చేపట్టగా అందులో సైతం బీజేపీ అభ్యర్థి ఆధిక్యం చూపారు. తొలుత 53 మందిని ఎలిమినేషన్‌ చేసి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా బీజేపీ అభ్యర్థికి 78,635 ఓట్లు, కాంగ్రెస్‌కి 73,644 ఓట్లు, బీఎస్పీకి 63,972 ఓట్లు వచ్చాయి. 53 మందిని ఎలిమినేషన్‌ చేసినా.. కోటా ఓట్లను ఎవరు సాధించకపోవడంతో మూడో స్థానంలోని బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నహరికృష్ణను ఎలిమినేట్‌ చేశారు. అతనికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రసన్నహరికృష్ణను ఎలిమినేషన్‌ చేసిన అనంతరం బీజేపీ అభ్యర్థికి 98,637 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థికి 93,531 ఓట్లు వచ్చాయి. మొత్తంగా కాంగ్రెస్‌ అభ్యర్థి కన్నా 5,106 ఓట్ల ఆధిక్యంలో ఉండటంతో బీజేపీ అభ్యర్థికి విజయం వరించింది. చివరకు బీఎస్పీ అభ్యర్థికి పోలైన ఓట్లలో చాలా మంది రెండో ప్రాధాన్యత ఓటును బీజేపీకే వేయడంతో కమలం పార్టీకే విజయం దక్కింది.

గ్రాడ్యుయేట్‌లోనూ బీజేపీ హవా

అధిక ఓట్లతో గెలిచిన అంజిరెడ్డి

మూడురోజులు సాగిన ఎమ్మెల్సీ కౌంటింగ్‌

ముగ్గురికే 92.52శాతం ఓట్లు

పకడ్బందీ ప్లాన్‌తో బీజేపీ సక్సెస్‌ సమన్వయం, సహకారం లేక కాంగ్రెస్‌ డీలా పోల్‌ మేనేజ్‌మెంట్‌లో బీఎస్పీ విఫలం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై పార్టీల అంతర్మథనం

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: రెండు ఎమ్మెల్సీలను ఎగరేసుకుపోయిన కమలం పార్టీ కేడర్‌లో జోష్‌ నెలకొంది. అధికారంలో ఉండీ.. గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీని దక్కించుకోకపోయినందుకు కాంగ్రెస్‌ పార్టీలో నైరాశ్యం నెలకొంది. కేవలం డబ్బు ప్రభావంతోనే తాము ఓడిపోయామని బీఎస్పీ భావిస్తోంది. మొత్తానికి పోల్‌ మేనేజ్‌మెంట్‌లో బీజేపీ అనుసరించిన విధానాలే తమను గెలిపించాయని బీజేపీతోపాటు ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌, బీఎస్పీ లు విఫలమయ్యాయని ఆయా పార్టీల్లో ప్రచారం మొదలైంది. బరిలో లేకున్నా.. అధికార కాంగ్రెస్‌ ఓటమిపై కారు పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ విధానాలు, వైఫల్యాలే వారిని ఓడించాయని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ఈ ఫలితాలు కమలంలో జోష్‌ను నింపాయి.

బీజేపీ ఈ విషయంలో ఆది నుంచీ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగింది. నియోజకవర్గం, మండలం, డివిజన్‌, గ్రామాల వారీగా పచ్చాస్‌ ప్రభారీలను నియమించి ప్రతీ 25 మందికి ఒక ఇన్‌చార్జిని కేటాయించింది. వారు ప్రతీ ఓటరును రోజూ కలవడం, అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పట్టభద్రులు, నిరుద్యోగులు, టీచర్స్‌ కోసం తాము చేసిన పోరాటాన్ని వివరిస్తూ ఓటర్లకు చేరువయ్యారు. దీనికితోడు కరీంనగర్‌ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ పూర్తిస్థాయిలో ప్రచారం చేయడం అభ్యర్థులకు బాగా కలిసి వచ్చిందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ పూర్తిస్థాయిలో నరేందర్‌రెడ్డికి సహకరించలేదన్న విమర్శలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా నాయకులు ఈ విషయంలో తమకు సహకరించినట్లుగా మిగిలిన మూడు జిల్లాల నాయకులు సహకరించలేదని నరేందర్‌రెడ్డి వర్గం అంతర్గత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌ నుంచి నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలిస్తే.. కాంగ్రెస్‌లోని ముగ్గురు కీలక నేతలకు పోటీగా ఎదుగుతాడ న్న ఆందోళనతో వారెవరూ సహకరించలేదని మండిపడుతున్నారు. దీంతోపాటు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్‌లోని కొందరు నేతలు మద్దతిచ్చారని, బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా లోపాయికారిగా సహకరించిందని ఆరోపిస్తున్నారు. ఇటీవల కరీంనగర్‌ సభలో సీఎం కూడా ఈ సీటు ఓడిపోతే తమకేం నష్టం లేదని వ్యాఖ్యానించడం తమకు చేటు చేసిందంటున్నారు. అంతేకాకుండా చెల్లకుండా పోయిన సుమారు 28 వేల ఓట్లలో దాదాపు 15 వేలకుపైగా ఓట్లు నరేందర్‌రెడ్డివే కావడం తమ కొంపముంచాయని విశ్లేషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పట్టభద్రుల సీటూ కమలానిదే!1
1/6

పట్టభద్రుల సీటూ కమలానిదే!

పట్టభద్రుల సీటూ కమలానిదే!2
2/6

పట్టభద్రుల సీటూ కమలానిదే!

పట్టభద్రుల సీటూ కమలానిదే!3
3/6

పట్టభద్రుల సీటూ కమలానిదే!

పట్టభద్రుల సీటూ కమలానిదే!4
4/6

పట్టభద్రుల సీటూ కమలానిదే!

పట్టభద్రుల సీటూ కమలానిదే!5
5/6

పట్టభద్రుల సీటూ కమలానిదే!

పట్టభద్రుల సీటూ కమలానిదే!6
6/6

పట్టభద్రుల సీటూ కమలానిదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement