
వర్కర్లను ఓనర్లు చేస్తాం
● నేతన్నలు, రైతన్నల సంక్షేమమే లక్ష్యం ● నేతన్నలకు రూ.900కోట్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇచ్చాం ● రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ● అపెరల్ పార్క్‌లో టెక్స్‌పోర్టు యూనిట్ ప్రారంభం ● 1,600 మంది మహిళలకు ఉపాధి ● పాల్గొన్న మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్
సిరిసిల్ల: వస్త్రపరిశ్రమలోని వర్కర్లను త్వరలోనే ఓనర్లుగా చేస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. నేతన్నలు, రైతన్నల సంక్షేమమే ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. సిరిసిల్ల శివారులోని పెద్దూరు అపెరల్‌పార్క్‌లో 7.6 ఎకరాల విస్తీర్ణంలో రూ.62కోట్లతో 1.73 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన టెక్స్‌పోర్టు యూనిట్‌ను శుక్రవారం మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా రూ.34కోట్లు నేతన్నల రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేశామని, రూ.914 కోట్ల బకాయిలు విడుదల చేశామని తెలిపారు. చేనేత బీమా, చేనేత భరోసా వంటి పథకాలకు రూ.290కోట్లు జమచేశామని చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని శాఖలకు అవసరమైన వస్త్రాలను చేనేత కార్మికుల ద్వారానే కొంటామని తెలిపారు. ఇప్పటికే కార్మికులకు రూ.900కోట్ల వస్త్రాల ఆర్డర్లు ఇచ్చినట్లు వివరించారు. సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని, దేశంలోని వివిధ ప్రాంతాల్లోని చేనేతకార్మికులు, పారిశ్రామికవేత్తలు తిరిగి ఈ ప్రాంతాలకు వచ్చి పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
చైతన్యవంతమైన ప్రాంతం
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సిరిసిల్ల చైతన్యవంతమైన ప్రాంతమని, దక్షిణకాశీగా పేరున్న వేములవాడ రాజన్న వెలసిన ధార్మిక క్షేత్రమన్నారు. నేతన్నలకు గతంలో అంత్యోదయకార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం అందించిందని తెలిపారు. టెక్స్‌పోర్టు సంస్థ ప్రతినిధులతో చర్చించి యూనిట్ ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. కరీంనగర్‌లో శాతవాహన యూనివర్సిటీని తమ ప్రభుత్వం స్థాపించిందని, అందులో ఇంజినీరింగ్, లా కళాశాలలను మళ్లీ తమ ప్రభుత్వమే మంజూరు చేసిందన్నారు.
నేతన్నల ఉపాధికి జీవో నంబరు వన్ తెచ్చాం
రాష్ట బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో జీవో నంబరు 1 తెచ్చినట్లు తెలిపారు. టెక్స్‌పోర్టు యూనిట్ ద్వారా స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు లభించడం సంతోషంగా ఉందన్నారు. సిరిసిల్లలో కరెంట్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని, బిల్లుల వసూళ్ల అంశాన్ని పక్కన పెట్టాలని చెప్పామన్నారు.
ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి ఆగిపోదని, మహిళా సంఘాల్లోని 65 లక్షల మందికి రెండు చీరల చొప్పున ఇచ్చే ఆర్డర్లు సిరిసిల్లకు వచ్చాయన్నారు. ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. రూ.50కోట్లతో నూలుబ్యాంకు ఏర్పాటు చేశామని, చేనేతకార్మికులకు ఉపాధి కల్ప న దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పాలిస్టర్‌తోపాటు కాటన్ పరిశ్రమను, అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా టెక్స్‌పోర్టు యూనిట్‌లో శిక్షణ పొందిన మహిళలకు మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి, కంపెనీ సీఈవో చంద్రశేఖర్, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల ఏఎంసీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూప, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం, వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జౌళిశాఖ అధికారులు వెంకటేశ్వర్‌రావు, రాఘవరావు పాల్గొన్నారు.

వర్కర్లను ఓనర్లు చేస్తాం

వర్కర్లను ఓనర్లు చేస్తాం