
తల్లడిల్లుతున్నారు
● ప్రమాదాల్లో పోతున్న ప్రమాదాలు ● మృతుల్లో అత్యధికులు యువకులే ● తల్లిదండ్రులకు కడుపుకోత ● నెల రోజుల్లో 35 ప్రమాదాలు.. 8 మంది మృతి ● వరుస ప్రమాదాలతో వణుకుతున్న వాహనదారులు ● నివారణ చర్యలు పట్టించుకోని అధికారులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): త్వరగా గమ్యం చేరుకోవాలన్న ఆతృతలో ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్నపాటి ఏమరపాటుతో ప్రాణాలు పోతున్నాయి. మరికొందరైతే శాశ్వతంగా అవిటితనంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల రాజన్నసిరిసిల్ల జిల్లాలో వరుసగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎంతో భవిష్యత్ ఉన్న యువకులు ప్రాణాలు కోల్పోతుండడం తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతోంది. జిల్లాలో నెల రోజుల వ్యవధిలో 35 రోడ్డు ప్రమాదాలు జరుగగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు గుండెకోత మిగులుతోంది. వరుస ప్రమాదాలు.. పోతున్న ప్రాణాలపై శ్రీసాక్షిశ్రీ ప్రత్యేక కథనం.
ఇరువై ఏళ్లకే నూరేళ్లు
తెలిసీతెలియని వయసు.. స్నేహితుల ప్రభావం.. స్పీడ్‌బైక్‌లు.. వెరసి యువకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రమాదాలు జరుగుతున్న సమయంలో వాహనాల వేగం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుండడమే ఇందుకు సాక్ష్యం. ఉన్నత విద్య చదువుకొని జీవితంలో స్థిరపడతారని అప్పుసప్పు చేసి చదివించిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతోంది.
నిబంధనలు గాలికి..
జిల్లాలో వాహనదారులు వేగంగా వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నా పోలీసులు, ఆర్టీఏ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గతంలో హెల్మెట్ నిబంధనను పక్కాగా అమలు చేసిన పోలీసులు, ఆర్టీఏ అధికారులు ప్రస్తుతం గాలికొదిలేశారు. చలాన్‌లు విధించే దానిపై పెట్టిన శ్రద్ధ హెల్మెట్ ధరించని వారిని ఆపి ఒక్క మంచి మాట చెప్పే ఓపిక అధికారులకు లేకుండాపోయింది. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారందరూ హెల్మెట్ ధరించకపోవడం ఇందుకు నిదర్శనం. పోలీసులు, ఆర్టీఏ అధికారులు జరిమానాలు విధించడంపైన పెట్టే శ్రద్ధలో కనీసం పదోవంతు శ్రద్ధ అవగాహన కల్పించడంపై పెడితే ప్రాణాలను కాపాడిన వారు అవుతారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
నెల రోజుల్లో 8 మంది
జిల్లాలో నెల రోజుల్లో జరిగిన ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ముగ్గురు ఇరువై ఏళ్ల లోపు యువకులే.
ఒకే ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురిలో నారాయణపూర్‌కు చెందిన షేక్ అవీజ్, షేక్ అఫ్రోజ్ అనే యువకులు చికిత్స పొందుతూ మూడు రోజుల వ్యవధిలోనే మృతిచెందారు. ఇదే ప్రమాదంలో గాయపడ్డ ఆటోడ్రైవర్ దుర్గయ్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
కిష్టునాయక్‌తండాకు చెందిన శివరాత్రి సాయికృష్ణ తన తల్లిదండ్రులతో కలిసి కొండగట్టుకు దైవదర్శనానికి వెళ్లగా అక్కడ జరిగిన ఆటో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
నెల రోజుల్లో 35 ప్రమాదాలలో 8 మంది ప్రాణాలు గాలిలో కలిశాయి.
అతివేగంతోనే ప్రమాదాలు
ప్రమాదాల నివారణలో భాగంగా బ్లాక్‌స్పాట్స్ గుర్తిస్తున్నాం. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. హెల్మెట్ ధరించాలనే దానిపై వాహనదారులకు అవగాహన కల్పించాం. మళ్లీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. వాహనాల వేగం తగ్గించడానికి ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడుతున్నాం. రోడ్లపై వాహనాల వేగం పరిమితిపై చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాస్‌గౌడ్, ఎల్లారెడ్డిపేట సీఐ

తల్లడిల్లుతున్నారు