రంగారెడ్డి: పెట్రోల్ పోసి తగులబెట్టి ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ రామాంజనేయులు తెలిపిన వివరాలు.. మంచాల మండలం జాపాల గ్రామానికి చెందిన మంథని కృష్ణ విద్యుత్ శాఖలో హెల్పర్‌గా పని చేస్తూ నాలుగేళ్ల క్రితం గ్రామంలోనే ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గ్రామస్తుల ఆందోళనతో ప్రభుత్వం కృష్ణ భార్య యాదమ్మ(38)కు తుర్కయంజాల్‌లో ఉన్న విద్యుత్ శాఖ డీఈఈ కార్యాలయంలో అటెండర్‌గా ఉద్యోగం కల్పించింది.
ఆమె నిత్యం జాపాల నుంచి తుర్కయంజాల్‌కు వెళ్లి వస్తుండేది. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరింది. రాత్రి 10 గంటలైనా ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై మంచాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ముచ్చర్ల శివారులోని చాకలోనికుంట సమీపంలో కాలిపోయిన ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు యాదమ్మ కుటుంబ సభ్యులను పిలిపించగా మృతదేహం ఆమెదేనని గుర్తించారు.
పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో వివరాలు సేకరించారు. సంఘటనా స్థలాన్ని ఇబ్రహీంపట్నం ఏసీపీ శ్రీనివాస్‌రావు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, జాపాల గ్రామం నుంచి మంగళవారం ఉద యం తుర్కయంజాల్‌లోని విద్యుత్ శాఖ డీఈఈ కార్యాలయంలో విధులకు వెళ్లిన యాదమ్మ సా యంత్రం కార్యాలయం ముందున్న సాగర్‌రోడ్డు వద్దకు వచ్చి ఓ కారులో వెళ్లినట్లు సీసీ పుటేజీలో రికార్డయింది.
ఆమె ఎవరి కారులో వెళ్లింది.. కారు లో ఉన్నదెవరు.. స్వగ్రామంలో ఏమైనా తగాదాలున్నాయా.. ఎక్కడో చంపి మృతదేహన్ని ఇక్కడి కి తీసుకొచ్చి పడేశారా.. అత్యాచారం చేసి, ఆనవాళ్లు దొరక్కకుండా తగులబెట్టడానికి యత్నించారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాద మ్మ వెళ్లిన కారు నంబర్‌ను సీసీ పుటేజీలో గుర్తించిన పోలీసులు ఆ దిశలో వివరాలు సేకరిస్తున్నారు.
జాపాలలో విషాదఛాయలు
మంచాల: యాదమ్మ మృతితో ఆమె స్వగ్రామం జాపాలలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలికి కూతుళ్లు అర్చన, విమల, కుమారుడు వీరేందర్ యాదవ్ ఉన్నాడు. తల్లిదండ్రుల మృతితో వారి కుటుంబం రోడ్డున పడింది. తల్లి మృతదేహాన్ని చూసి పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment