ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
ఇబ్రహీంపట్నం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో శుక్రవారం సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఫార్మాసిటీ రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ నిలిపి వేయాలని, ఫార్మాసిటీపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. కప్పపహాడ్ గ్రామంలో 98 ఏకరాల బినామీ భూమిని పేదలకు పంపిణీ చేయాలని, ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన వారికే కేటాయించాలని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని, జనాభా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేపట్టి, చట్టబద్ధత కల్పించాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. దేశ వ్యాప్త కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.భాస్కర్, సామేల్, రాంచందర్, నర్సింహ్మా, కందుకూరి జగన్, జగదీశ్, జిల్లా నాయకులు జంగయ్య, అలంపల్లి నర్సింహ్మా, బుగ్గరాములు, జగన్, బాల్‌రాజ్, దేవేందర్, పెంటయ్య, శేఖర్‌లు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఇబ్రహీంపట్నంలో పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశం
Comments
Please login to add a commentAdd a comment