సాక్షి, రంగారెడ్డి: రానున్న వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో సంబంధిత ఏఈలతో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ గ్రిడ్ ఇంట్రా తాగునీటి సరఫరాలో భాగంగా చేపట్టిన పనులు, ప్రస్తుతం నీటి సరఫరా జరుగుతున్న ఆవాసాలు, వాటర్ స్టోరేజీ ఇబ్బందులు, తదితర అంశాలపై కలెక్టర్ డివిజన్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా సమస్యలు ఎక్కడ ఉత్పన్నమవుతాయో గుర్తించి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇంట్రాలో లీకేజీ మరమ్మతులు ఏమైనా ఉంటే సరిచేయాలని సూచించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ప్రస్తుత నిధులతో పైప్‌లైన్లు, చిన్నచిన్న మరమ్మతులు చేయించి నీటి ఎద్దడిని నివారించాలన్నారు. గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా నివాస ప్రాంతాలకు తాగునీరు అందే విధంగా పనులు చేపట్టాలని అన్నారు. నీటి పంపులు, మోటార్లు, వాల్వ్‌లు, పైపులకు సంబంధించి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ రాజేశ్వర్, ఏఈలు, డీఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment