సాక్షి, సిటీబ్యూరో: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక రాబడి ఆర్జించవచ్చని అమాయకులను మోసం చేస్తున్న కేటుగాణ్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. చైన్నెకి చెందిన ఎస్.రామకృష్ణారెడ్డి తన సోదరుడితో కలిసి క్రిప్టో కరెన్సీ వ్యాపారులను మోసం చేసి, సులభంగా డబ్బు సంపాదించడానికి పథకం వేశాడు. ఈక్రమంలో బిట్‌కాయిన్ ఇండియా సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ పేరిట సంస్థను ప్రారంభించాడు. ట్రేడింగ్ కస్టమర్లు తన ప్లాట్‌ఫామ్ ద్వారా క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేస్తే అధికంగా సంపాదించొచ్చని ఆశ పెడుతూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు. ఈ ప్రకటనకు ఆకర్షితుడైన జూబ్లీహిల్స్‌కు చెందిన 35 ఏళ్ల బాధితుడు రూ.8.49 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేశాడు. కొంతకాలం తర్వాత ఇన్వెస్టర్ మొత్తం సొమ్మును నిర్వహణ రుసుము పేరుతో స్వాహా చేయడంతో జీరో బ్యాలెన్స్‌గా కనిపించింది. పైగా గడువు ముగిసినట్లు కనిపించింది. దీంతో బాధితుడు వెంటనే ఈ–మెయిల్ ద్వారా బిట్‌కాయిన్ ఇండియా వాలెట్ సపోర్ట్‌ను సంప్రదించగా ఎలాంటి స్పందన లేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. సాంకేతిక ఆధారాలతో రామకృష్ణా రెడ్డిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment