బంజారాహిల్స్: మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్న వ్యాపారిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్.10లోని వెంకటగిరి ఎస్‌బీఐ బ్యాంక్ ఎదురుగా కె.వెంకటేశ్వరరావు అనే వ్యాపారి గత కొంతకాలంగా తన కుమారుడితో కలిసి మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఇక్కడ దాడులు చేసి మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తుండగా వెంకటేశ్వర రావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇక్కడ సిగరెట్లు విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు మాటు వేశారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థి (15) ఇక్కడ సిగరెట్లు కొనుగోలు చేసి పట్టుబడ్డారు. వెంటనే పోలీసులు సోదాలు నిర్వహించి ఖరీదైన సిగరెట్లను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంధం ప్రమీల కూడా ఇదే ప్రాంతంలో సిగరెట్లు మైనర్లకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. సుమారు రూ.6 వేలు విలువ చేసే ఈ సిగరెట్లను సీజ్ చేశారు. ఇదిలా ఉండగా యాంటీ నార్కోటిక్ బ్యూరోకు ఇటీవలనే ఫిర్యాదు కూడా అందింది. దీంతో సీఐ లాల్‌మదార్, ఎస్‌ఐ వెంకటరమణ తదితరులు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి వీరిపై కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment