హర్యానా గ్యాంగ్ పనేనా!
రావిర్యాల్ ఏటీఎం చోరీ ఘటనపై అంచనా
● దొంగిలించిన సొమ్ముతోముంబైకి పరార్ ● కారు నంబర్లు మార్చి పక్కదారి పట్టిస్తున్న దుండగులు ● ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
ఇబ్రహీంపట్నం రూరల్: రావిర్యాల్‌లో చాకచక్యంగా ఏటీఎంలోకి ప్రవేశించి నాలుగు నిమిషాల్లోనే ఏకంగా రూ.29.69 లక్షలు ఊడ్చుకెళ్లిన దుండగులను హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సినీ ఫక్కీ మాదిరి తక్కువ సమయంలో అంత పెద్ద దోపిడీ చేయడమంటే ఎంతో నేర్పరిలకే సాధ్వమవుతుందనే అంచనాకు వచ్చారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఘటనలో ఆదిబట్ల పోలీసులతో పాటు రాచకొండ కమిషనరేట్‌లో ఉన్న పోలీసు బృందాలు కూపీ లాగుతున్నాయి. ఇప్పటికే బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. 24 గంటలుగా నిద్రహారాలు మాని దొంగలను పట్టుకునే పనిలో తలమునకలయ్యారు.
ఇదే తరహాలో రాగన్నగూడలో..
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌టీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఏటీఎంలో కూడా 2019లో ఇలాంటి తరహాలోనే అర్ధరాత్రి ఇనుపరాడ్లు, గ్యాస్ కట్టర్లతో దోపిడీకి యత్నించారు. పెట్రోలింగ్ వాహనం నిరంతరం గస్తీ కాయడంతో గమనించి టాటా సుమోలో వచ్చిన దుండగులు గ్యాస్ కట్టర్లు, ఇనుప రాడ్లు అక్కడే వదిలేసి పారిపోయారు. వేలి ముద్రలు గుర్తించిన పోలీసు అధికారులు దొంగలను పట్టుకోవడానికి అప్పట్లో తీవ్రంగా శ్రమించారు. కానీ నేరస్తులను పట్టుకోలేకపోయారు. హర్యానా గ్యాంగ్ పనేనని గుర్తించారు. మళ్లీ అదే తరహాలో రావిర్యాల్‌లో ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ చాకచక్యంగా నగదు దొంగిలించి తప్పించుకొని పారిపోయారు.
అదే రోజు మైలార్‌దేవరపల్లిలో..
రావిర్యాల్‌కు రాక ముందు పహడీషరీఫ్ నుంచి వచ్చిన స్విఫ్టు కారులో దుండగులు మైలార్‌దేవరపల్లిలోని ఏటీఏంపై దాడి చేశారు. అక్కడ వారికి అనుకూలంగా లేకపోవడంతో ఎలాంటి దోపిడీకి పాల్పడలేదని పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి నేరుగా రావిర్యాల్‌కు వచ్చి దోచుకెళ్లారు.
ప్రత్యేకంగా 20 బృందాలు
రావిర్యాల్ ఎస్‌బీఐ ఏటీఎంలో దొంగతనానికి పాల్పడిన దుండగులు దొంగిలించిన సొత్తుతో అదే కారులో పహాడీషరీఫ్ నుంచి ముంబై రహదారి వైపు వెళ్లారు. ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా ముంబైకి వెళ్లినట్లు సీసీ ఫూటేజీల ఆధారంగా గుర్తించారు. దుండగులు నేరానికి పాల్పడిన సమయంలో ఉపయోగించిన తెలుపు రంగు కారు నంబరు ప్లేట్లు కూడా మార్పిడి చేసినట్లు నిర్ధారించారు. ఫేక్ నంబరు ప్లేట్లు ఉపయోగించి పోలీసులను తప్పుదోవ పట్టించారు. అలాగే ఎక్కడా వేలి ముద్రలు లభించకుండా, మోకాలు కనిపించకుండా మాస్కులను వాడారంటే పేరు మోసిన దొంగలుగా నిర్ధారణకు వచ్చారు. సెల్‌ఫోన్ లోకేషన్లు, టవర్ లోకేషన్ల ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే 20కి పైగా బృందాలు దుండగులను పట్టుకోవడానికి గాలింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment