నిఘా నీడలో.. | - | Sakshi
Sakshi News home page

నిఘా నీడలో..

Published Wed, Mar 5 2025 9:07 AM | Last Updated on Wed, Mar 5 2025 9:07 AM

నిఘా నీడలో..

నిఘా నీడలో..

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● జిల్లాలో పరీక్ష కేంద్రాలు : 185 ● మొదటి సంవత్సరం విద్యార్థులు : 80,409 ● ద్వితీయ సంవత్సరం స్టూడెంట్స్‌ : 78,395 ● మొత్తం హాజరయ్యేవారు : 1,58,804 ● సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలు

షాద్‌నగర్‌: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కీలకమైన ఇంటర్‌ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌కు తావు లేకుండా ప్రత్యేక స్క్వాడ్‌ బృందాలను నియమించారు.

ద్వితీయ సంవత్సరం గురువారం నుంచి..

ఈ నెల 22 వరకు పరీక్షలు జరగనున్నాయి. మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం నుంచి, ద్వితీయ సంవత్సరం గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 185 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మొదటి సంవత్సరం 80,409 మంది, ద్వితీయ సంవత్సరం 78,395 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పించడంతో పాటు, అన్ని గదుల్లో లైట్లు, ఫ్యాన్లు ఉండేలా, విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

పటిష్టమైన పర్యవేక్షణ

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 185 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 185 మంది డిపార్టుమెంటల్‌ అధికారులు, 45 మంది కస్టోడియన్‌ అధికారులు, 4 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, 10 సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. లీకేజీకి ఆస్కారం లేకుండా ఈసారి కొత్తగా ప్రతి ప్రశ్నపత్రంపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించినట్లు అధికారులు తెలిపారు. ప్రశ్నపత్రాన్ని స్కాన్‌ చేస్తే అది ఏ కేంద్రానికి సంబంధించిందో వివరాలు తెలుస్తాయి.

హాల్‌టికెట్లపై క్యూఆర్‌ కోడ్‌

చాలా మంది విద్యార్థులు పరీక్ష కేంద్రం ఎక్కుడుందో తెలుసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతుంటారు.దీన్ని గుర్తించిన ఇంటర్‌ బోర్డు హాల్‌ టికెట్లపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించింది. ఈ కోడ్‌ను స్కాన్‌ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామాతో పాటు ఫొ టోలు కనిపిస్తాయి. గూగుల్‌ మ్యాప్‌తో అనుసంధానమై ఉండటంతో ఉన్నచోట నుంచే ఎంతసమయంలో పరీక్ష కేంద్రానికి చేరుకోగలరో తెలుస్తుంది.

సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ

ప్రశ్నపత్రాల పంపిణీ నుంచి విద్యార్థుల దగ్గర సమాధాన పత్రాలు తీసుకునే వరకు ప్రతి అంశాన్ని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ సిస్టం ద్వారా ఇంటర్‌ బోర్డు ప్రధాన కార్యాలయానికి అనుసంధానించే ఈ కెమెరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పరిసర ప్రాంతాల్లో జిరాక్స్‌ కేంద్రాలను మూసివేయనున్నారు.

మౌలిక సదుపాయాలు

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. తాగునీటి వసతితో పాటు అత్యవసర వైద్య సాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎండల నేపథ్యంలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.

పకడ్బందీ చర్యలు

ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. చేతి గడియారాలకు అనుమతి ఉండదు. విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాం.

– వెంక్యా నాయక్‌, డీఐఈవో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement