మహిళా సాధికారతే లక్ష్యంగా పని చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళా సాధికారతే లక్ష్యంగా పని చేయాలని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీసీపీ మాట్లాడుతూ.. సృష్టికి మూలం మహిళలే అని అన్నారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర చాలా గొప్పదన్నారు. వారి రక్షణ కోసం ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పని చేస్తోందన్నారు. మహిళల భద్రత కోసం పటిష్ట చట్టాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. షీటీం ఆకతాయిలపై కొరడా జులిపిస్తోందని తెలిపారు. మహిళలను చైతన్యం చేయడం ద్వారానే హత్యలు, అత్యాచారాలు తగ్గుముఖం పడతాయన్నారు. కార్యక్రమంలో గురునానక్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ హెచ్‌ఎస్ సైనీ, అధ్యాపకులు, పాల్గొన్నారు.
‘స్మయిల్ ఆల్వేస్’కు
ఉత్తమ అవార్డు
ఇబ్రహీంపట్నం రూరల్: ఆడబిడ్డల చదువుకు అండగా నిలుస్తున్న స్మయిల్ ఆల్వేస్ ఫౌండేషన్ సంస్థ సేవలను ప్రభుత్వం గుర్తించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ సేవా అవార్డును ప్రకటించింది. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో స్మయిల్ ఆల్వేస్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు కోడి సుధామనుడుకు అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అవార్డు అందజేశారు. శాలువతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సుధామనుడు మాట్లాడుతూ.. 500 మంది ఆడబిడ్డలను చదివించడమే కాకుండా దాదాపు 100 మందికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు తెలిపారు. అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు.
సామాన్యులకు నాణ్యమైన వైద్యమే లక్ష్యం
మీర్‌పేట: సామాన్య ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని చేవెళ్ల లోక్‌సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ ఔషధ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జేపీ నడ్డా ఆదేశాల మేరకు శుక్రవారం మీర్‌పేట రైతుబజార్ వద్ద ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ (జనరిక్ మెడికల్) కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం వైద్యం ఎంతో ఖరీదుతో కూడుకున్నదని, తక్కువ ధరకే పేదలకు మందులు అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ కేంద్రాల్లో 80 నుంచి 90 శాతం వరకు తగ్గింపుతో మందులు లభిస్తాయని తెలిపారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఆయన జనరిక్ మాత్రలను కొనుగోలు చేసి గూగుల్‌పే ద్వారా బిల్లు చెల్లించారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్, కొలన్ శంకర్‌రెడ్డి, మీర్‌పేట–1,2 అధ్యక్షులు భిక్షపతిచారి, ముఖేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
రేపు ఇండియాకు ప్రవీణ్ మృతదేహం
కేశంపేట: అమెరికాలో మృతిచెందిన విద్యార్థి ప్రవీణ్‌కుమార్ మృతదేహం ఆదివారం ఇండియాకు రానుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అనంతరం స్వగ్రామం కేశంపేటకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ప్రవీణ్ తల్లిదండ్రులు గంప రాఘవులు, రామాదేవి దంపతులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య వేర్వేరుగా పరామర్శించారు. ఫోన్‌ద్వారా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు.
మహిళా సాధికారతే లక్ష్యంగా పని చేయాలి
Comments
Please login to add a commentAdd a comment