మూసీ!
మల్లన్న సాగర్ టు
సాక్షి, సిటీబ్యూరో: మూసీ పునరుజ్జీవానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. కంపుకొట్టే మూసీ నదిని సుందరీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు కార్యాచరణ వేగవంతం చేశారు. మూసీ ఆక్రమణలతో పాటు నది శుద్ధి కోసం కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు 20 టీఎంసీల నీటిని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 5 టీఎంసీల నీటిని మూసీ నది శుద్ధి కోసం..15 టీఎంసీల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వినియోగించాలని సీఎం నిర్ణయించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ నుంచి ప్రత్యేక పైప్‌లైన్ల ద్వా రా నీటిని మళ్లించేలా పనులు చేపట్టనున్నారు. గోదావరి నుంచి 5 టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవం కోసం హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు మళ్లించి, శుద్ధి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే గోదావరి–మూసీ అనుంధానం కోసం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.
రూ.14,100 కోట్ల ఆర్థిక సాయం..
ఒకప్పుడు భాగ్యనగర వాసుల తాగునీటి అవసరాలను తీర్చిన మూసీ నది..కాలక్రమంలో గృహ, పారిశ్రామిక వ్యర్థాల పారబోతతో కలుషితమైపోయింది. మూసీ పునరుజ్జీవం చేపట్టాలంటే ముందుగా నది పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలను తొలగించడంతో పాటు నదిలో పారబోస్తున్న కలుషితాలను అడ్డుకోవడం ప్రధాన లక్ష్యం. ఇప్పటికే తొలగించాల్సిన ఆక్రమణలను మూసీ రిఫర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్‌డీసీఎల్) అధికారులు గుర్తించారు. త్వరలోనే వాటిని తొలగించి, బాధితులకు పునరావాసం కల్పించనున్నారు. ఈమేరకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. మూసీ పునరుజ్జీవం కోసం రూ.14,100 కోట్ల ఆర్ధిక సాయాన్ని కోరుతూ రాష్ట్ర సర్కారు కేంద్రానికి లేఖ రాసింది.
గోదావరి నుంచి 20 టీఎంసీల నీళ్లు తరలింపు
ఇందులో 5 టీఎంసీల నీటితో మూసీ శుద్ధి
నదిపై 11 హెరిటేజ్ వంతెనల నిర్మాణం
గాంధీ సరోవర్ లాగే బాపూఘాట్ అభివృద్ధి
కేంద్రాన్ని రూ.14,100 కోట్ల ఆర్థిక సాయాన్ని కోరిన సర్కారు
గాంధీ సరోవర్ లాగా..
కేదర్‌నాథ్‌లోని గాంధీ సరోవర్ లాగా బాపూఘాట్‌ను అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.5 కి.మీ., అలాగే హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు ఉన్న 8.5 కి.మీ. మూసీ నదీ సుందరీకరణకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఆయా మార్గంలో రక్షణ శాఖకు చెందిన 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణ శాఖకు లేఖ రాశారు. అలాగే మూసీ నదిపై 11 చోట్ల హెరిటేజ్ బ్రిడ్జ్‌లను నిర్మించనున్నారు. రూ.1,000 కోట్ల నిర్మాణ వ్యయాన్ని అంచనా వేశారు. ఇప్పటికే బాపూ ఘాట్ వద్ద మూసీ పునరుజ్జీవం పనులకు డీపీఆర్ రూపొందగా.. ఆమోదం కోసం కేంద్రానికి రాష్ట్ర పభుత్వం పంపించింది. ఈ ఏడాది బాపూఘాట్ వద్ద 90 శాతం పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment