
ఫార్మాసిటీనా.. ఫ్యూచర్ సిటీనా?
యాచారం: ఫార్మాసిటీనా.. ఫ్యూచర్ సిటీనా.. సర్కార్‌కు దేనిపైనా స్పష్టత లేదని, ఫార్మాసిటీని రద్దు చేసినట్లయితే సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ భూ బాధితుల సమస్యలపై మంగళవారం కుర్మిద్ద గ్రామంలో నిర్వహించిన సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఫార్మాసిటీ ఏర్పాటు పేరుతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేసిందన్నారు. రైతుల అంగీకారం లేకుండానే నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో 800 మందికి చెందిన 2,200 ఎకరాల పట్టా భూములను ఫార్మా కోసం తీసుకుంటున్నట్లు ప్రకటించి, రాత్రికి రాత్రే ధరణి పోర్టల్‌లో టీఎస్‌ఐఐసీ అని మార్చారని గుర్తుచేశారు. ఈ విషయమై బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ధరణి పోర్టల్‌లో టీఎస్‌ఐఐసీ పేరు తీసేసి రైతుల పేర్లు నమోదు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు యంత్రాంగం స్పందించడం లేదని మండిపడ్డారు. ఫార్మా భూ బాధితుల విషయాన్ని అసెంబ్లీలో చర్చించి, న్యాయంచేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ఇందుకోసం వారం రోజులు గడువు ఇస్తున్నామని, లేదంటే ఈనెల 20న ఫార్మా గ్రామాల నుంచి పాదయాత్ర ప్రారంభించి, 21న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ప్రకటించారు. తర్వాత ఏం జరిగినా సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫార్మాసిటీకి భూములు తీసుకున్నందుకు గాను ఎకరాకు 121 గజాల ప్లాటు బదులు ఎకరాకు 500 గజాల ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాల భూములను సేకరించాలని చూస్తున్న సర్కార్.. వీటిని కోట్లాది రూపాయలకు బడా పారిశ్రామికవేత్తలకు అమ్ముకోవడం ఖాయమన్నారు. ఎన్ని పరిశ్రమలు వచ్చినా.. ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా రైతులకేమీ ఉపయోగం ఉండదని తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలేసి నివాళుర్పించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు రాంచందర్, పి.అంజయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.మధుసూదన్‌రెడ్డి, న్యాయవాది అరుణకుమార్, నాయకులు పెద్దయ్య, జగన్, బ్రహ్మయ్య, తావునాయక్, విప్లవ్‌కుమార్, ఆలంపల్లి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
తుక్కుగూడ: దేశంలో ఆర్థిక లేని వ్యవస్థ కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఆపార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పార్టీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం తుక్కుగూడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో సెమినార్ నిర్వహించారు. అంతకు ముందు కార్మికులు, కర్షకులతో కలిసి ఔటర్ రింగు రోడ్డు హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన అనంతరం నిరుపేదల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిందన్నారు. ఇదే సమయంలో కార్పొరేట్ శక్తుల ఆదాయం వంద రెట్లు పెరిగిందని ఆరోపించారు. దేశంలో జీఎస్టీ వసూలు పేరుతో పేదలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఖనిజ సంపదను పూర్తిగా బడా కంపెనీలకు దోచి పెడుతున్నారన్నారు. మతతత్వ బీజేపీపై పోరాడేందుకే తాము కాంగ్రెస్ పార్టీతో జత కట్టామని స్పష్టంచేశారు. దేశంలోని నిరుపేదలు, కార్మికులు, కర్షకుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నది కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని వెల్లడించారు. ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామికవాదులు, కవులు, కళాకారులపై దాడులు, హత్యలు జరుగుతునయన్నారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకులు జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి, నాయకులు పుస్తకాల నర్సింగ్‌రావు, పానుగంటి పర్వతాలు, యాదిరెడ్డి, దత్తునాయక్, నర్సింహ్మ, యాదయ్య, పార్టీ శ్రేణులు, కార్మికులు, పాల్గొన్నారు.
అసమానతలు లేని ఆర్థిక వ్యవస్థ కావాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ఏది ఏర్పాటు చేస్తారో స్పష్టత ఇవ్వాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
Comments
Please login to add a commentAdd a comment