● టీజీఎండీసీ ఆధ్వర్యంలోప్రభుత్వ సాండ్ బజార్లు ● సన్న ఇసుక టన్నుకు రూ.1,800, దొడ్డుది రూ.1,600 ● అందుబాటులోకి అబ్దుల్లాపూర్‌మెట్ సాండ్‌బజార్.. ● నేడు మేడ్చల్ జిల్లా బౌరంపేటలో, ● రేపు వట్టినాగులపల్లిలోనూ ప్రారంభం
సాక్షి, రంగారెడ్డి: ఇసుక అక్రమ దందాకు ప్రభు త్వం చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇసుక బుకింగ్, తరలింపులో దళారుల ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా నాణ్యమైన ఇసుకను నిర్మాణదారులకు అందజేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సాండ్ బజార్‌లను ప్రారంభించాలని తీర్మానించింది. ఈ మేరకు సోమవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో సాండ్ బజార్‌ను ప్రారంభించింది. మంగళవారం మేడ్చల్ జిల్లా బౌరంపేటలో, బుధవారం రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో మరో రెండు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వమే స్వయంగా క్వారీల నుంచి ఇసుకను లారీల్లో ఇక్కడికి తరలించి, నిర్మాణదారులకు సరఫరా చేయనుంది. సన్న ఇసుక టన్నుకు రూ.1800, దొడ్డు ఇసుక టన్నుకు రూ. 1600 ధరగా నిర్ణయించింది. భవన నిర్మాణదారులు మీ సేవ కేంద్రాల్లో/టీజీఎండీసీ వెబ్‌సైట్‌లో నేరుగా ఇసుకను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.
రోజుకు 50 వేల టన్నులు..
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీ సంఖ్యలో భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వ్యక్తిగత నివాసాలతో పాటు అపారు్‌ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల నిర్మాణం కోసం ఇసుక అవసరం. నగరంలో రోజుకు సగటు 50 వేల టన్నుల ఇసుక అవసరం ఉంటుందని అంచనా. కాళేశ్వరం, కరీంనగర్, భద్రాచలం, జాజిరెడ్డిగూడెం నుంచి గత నెల వరకు రోజుకు సగటున 1,400 లారీల్లో ఇసుకను తరలించగా, ప్రస్తుతం ప్రభుత్వ లోడింగ్‌పై విధించిన ఆంక్షలతో ఇసుక తరలించే లారీల సంఖ్య రెండు వేలకు చేరుకుంది. గతంలో ఒక్కో లారీలో 50 టన్నులకుపైగా ఇసుక తరలిస్తే.. ప్రస్తుతం 25 టన్నులే వస్తోంది. ఫలితంగా ఇసుకను తరలించే లారీల సంఖ్య ప్రస్తుతం రెండు వేలకు చేరింది. ఆయా లారీల యజమానులు ప్రభుత్వ క్వారీల నుంచి ఇసుకను లోడ్ చేసుకుని వచ్చినగర శివారు ప్రాంతాల్లోని ఆటోనగర్, ఉప్పల్, మంద మల్లమ్మ చౌరస్తా, ఉప్పరిగూడ, శివరాంపల్లి, ఉప్పల్ రింగ్‌రోడ్డు, బోడుప్పల్ ప్రధాన రహదారి వెంట ఉన్న ఖాళీ స్థలాల్లో నిలిపి అమ్ముతుంటారు.
దళారులకు ఇక చెక్..
దళారులు ఆయా లారీల యజమానులతో ముందే కుమ్మకై ్క ఇసుక ధరను అమాంతం పెంచేస్తున్నారు. అంతేకాదు.. ఏకధాటి వర్షాలకు వాగుల్లో వరదలు పోటేత్తే సమయంలో కృత్రిమ కొరత సృష్టించి, అప్పటికే డంపింగ్ కేంద్రాల్లో నిల్వ చేసిన ఇసుకకు భారీ ధరలు నిర్ణయించి అమ్ముతున్న విషయం తెలిసిందే. సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో టన్ను రూ.1200 లోపే దొరికే ఇసుక.. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఏకంగా రూ.2500 నుంచి రూ.3000 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక లేకపోతే పని ఆగిపోయే ప్రమాదం ఉందని భావించి ఇష్టం లేకపోయినా నిర్మాణదారులు వారు చెప్పిన ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇసుక అక్రమ దందాకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్వారీలపై నిఘా పెంచింది. ప్రస్తుతం ఆయా ఇసుక క్వారీలన్నింటిని తమ చేతుల్లోకి తీసుకుంది. ఓవర్‌లోడు కారణంగా రహదారులు దెబ్బ తినకుండా చెక్ పెట్టేంది. అంతేకాదు బహిరంగ మార్కెట్లో ఇసుక అధిక ధరలకు కళ్లెం వేసినట్లయింది.