
వాటర్ లైన్‌మెన్లతో జూమ్ మీటింగ్
సాక్షి, సిటీబ్యూరో: జలమండలి నీటి సరఫరాలో శాశ్వతంగా లో–ప్రెషర్ సమస్యను పరిష్కరించేందుకు వాటర్ లైన్‌మెన్లపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఏకంగా ఎండీ అశోక్ రెడ్డి లైన్‌మెన్లతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. తాజాగా బుధవారం డివిజన్ 18 పరిధిలోని లైన్‌మెన్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఒక్కో లైన్‌మెన్ ఎన్ని వాల్వ్‌లను ఆపరేట్ చేస్తారో వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు ఎలా చేయాలో చర్చించారు. ప్రతి లైనన్‌మన్ ఆధీనంలో ఉన్న ఆపరేషన్ వాల్వ్‌ల సంఖ్య, నీటి సరఫరా చేసే క్యాన్ నంబర్లు, వాల్వ్ ఆపరేషన్ సమయాన్ని తగ్గించడం తదితర అంశాలపై లైన్‌మెన్లతో చర్చించారు. వీటితోపాటు మెట్రో కస్టమర్‌లో నమోదయ్యే సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలను జీఎంను అడిగి తెలుసుకున్నారు. ఈ జూమ్ మీటింగ్‌లో జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్, ఈఎన్సీ– డైరెక్టర్ ఆపరేషన్–2 వీఎల్ ప్రవీణ్ కుమార్, జీఎం, డీజీఎం ఇతర అధికారులు పాల్గొన్నారు
బైకును ఢీకొట్టిన వాటర్ ట్యాంకర్
భార్య మృతి..భర్తకు గాయాలు
మాదాపూర్: వాటర్ ట్యాంకర్ బైక్‌ను ఢీకొనడంతో మహిళ మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం..బిహార్ రాష్ట్రానికి చెందిన శ్రీకాంత్ కుమార్ భార్య మనీషా కుమారితో కలిసి బుధవారం ఉదయం బైక్‌పై పర్వత్‌నగర్ నుంచి మైహోంభుజ అపార్ట్‌మెంట్‌కి వెళ్తుండగా..సైబర్ టవర్ ఎంట్రీ గేట్ వద్ద ఓ వాటర్ ట్యాంకర్ అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొంది. దీంతో ఇద్దరు బైక్‌పై నుంచి పడిపోగా మనీషాకుమారి పైనుంచి వాటర్ ట్యాంకర్ వెళ్లడంతో తీవ్రగాయాలై ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. శ్రీకాంత్ కుమార్ తల, చేతులకు స్వల్పగాయాలయ్యాయి. నిర్లక్ష్యంగా నడిపిన వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌ను కె.శ్రీనివాస్‌గా గుర్తించారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కోపంతోనే వృద్ధురాలిని చంపేశాడు...
● కమలాదేవి హత్య కేసును ఛేదించిన పోలీసులు
● జువైనల్ హోంకు మైనర్ తరలింపు
కుషాయిగూడ: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హెచ్‌బీకాలనీ, కృష్ణానగర్ రోడ్డు నెంబరు–5లో చోటు చేసుకున్న కమలాదేవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె తిడుతుందనే కోపంతో కసి పెంచుకున్న మైనర్ బాలుడే ఆమెను హత్యచేశాడని, ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదని తేల్చారు. నిందితుడితో పాటు హార్డ్‌వేర్ అండ్ ఎలక్ట్రికల్ షాప్ యజమానులు ప్రకాష్‌చౌదరి, లలిత్‌చౌదరిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని సుదీర్ఘంగా విచారించారు. సీసీ పుటేజీలతో పాటు వారి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు చివరకు బాలుడే కమలాదేవిని హత్య చేసినట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు అతన్ని జువైనల్ హోంకు తరలించారు. ఈ విషయాలను బుధవారం కుషాయిగూడ ఏసీపీ మహేష్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. విషయం వెల్లడవడంతో పారిపోయేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లి ట్రైన్ కోసం వేచి చూస్తున్న మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. కమలాదేవిని హత్య చేసిన విషయాలను బాలుడు వెల్లడించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. మేడ్చల్ కోర్టులో హాజరు పరిచిన అనంతరం అతడి వద్ద నుంచి రక్తపు మరకల దుస్తులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు.
దైవ సన్నిధానంలో సీఎస్ ప్రత్యేక పూజలు
ఫిలింనగర్: ఫిలింనగర్ దైవ సన్నిధానంలో బుధవారం సంకష్ట హరచతుర్థి సందర్భంగా వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని విశేష మల్లె పుష్పార్చనతో పాటు 350 కిలోల బెల్లంతో అలంకరించారు. వేకువ జామునే పంచామృతాభిషేకం, పల్లకీ సేవ వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజల్లో చీఫ్ సెక్రటరీ (సీఎస్) శాంతికుమారి పాల్గొన్నారు.