మొయినాబాద్: కొత్తగా ఏర్పడిన మొయినాబాద్ మున్సిపాలిటీలో వేసవి ఆరంభంలోనే నీటి కష్టాలు మొదలయ్యాయి. మిషన్ భగీరథ నీళ్లు సరిగా రాకపోవడంతో కొన్ని గ్రామాలు, కాలనీల్లో బోర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ కేంద్రంలోని లక్ష్మీగణపతి నగర్ కాలనీ, భరద్వాజ్ కాలనీ, ముస్తఫాహిల్ కాలనీలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ఆయా కాలనీల్లో ఉన్న బోర్ల ద్వారానే సరఫరా చేస్తున్నారు. లక్ష్మీగణపతి నగర్ కాలనీలో బోర్ల నుంచి ఇళ్లలోకి నేరుగా పైపులు వేసుకుంటున్నారు. పెద్దమంగళారం గ్రామానికి సైతం మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావడం లేదు. వచ్చిన నీటిని అరగంటసేపు మాత్రమే ఇళ్లలోకి వదులుతున్నారు. చిలుకూరులోని రాజీవ్ గృహకల్ప కాలనీకి మిషన్ భగీరథ పైప్‌లైన్ ఇప్పటి వరకు వేయలేదు. అక్కడ బోర్ల ద్వారానే నీళ్లు అందిస్తున్నారు. ప్రస్తుతం బోర్లలో సైతం నీళ్లు తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో బోర్లు ఎండిపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాలనీవాసులు వాపోతున్నారు. హిమాయత్‌నగర్‌లో మిషన్ భగీరథ పైప్‌లైన్లు తరచూ లీకేజీ అవుతున్నాయి. రెండు నెలల కాలంలో పది చోట్ల పైప్‌లైన్లు లీక్ అయ్యాయి. రెండు రోజుల క్రితం సైతం హిమాయత్‌నగర్‌లోని ఎస్సీ కాలనీలో పైప్‌లైన్ లీకేజీ కావడంతో కాలనీకి నీటి సరఫరా నిలిచిపోయింది.
సమస్యలు రాకుండా చూస్తున్నాం
గతంలో ఉన్న జనాభా ప్రకారం మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. ప్రస్తుతం కాలనీలు పెరగడంతో ఆ నీళ్లు సరిపోవడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు రానిచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. బోర్ల ద్వారా నీటిని అందిస్తున్నాం. వేసవి మొదలు కావడంతో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– ఖాజా మొయిజుద్దీన్, మున్సిపల్ కమిషనర్
● మిషన్ భగీరథ.. అంతంతే..